Who Is Eligible For Toll Tax Exemption: ప్రైవేట్ కార్ల ఓనర్లకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఇకపై హైవేలపై ఏ విధమైన టోలు కట్టక్కర్లేదని తెలిపింది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక కూడా పెట్టింది. 20 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఈ మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సెంట్రల్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్స్ శాఖ పాలసీలో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ప్రైవేటు కార్లు ఈ మినహాయింపు పొందేందుకు కార్లలో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్- జీఎన్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. ఈ జీఎన్‌ఎస్‌ఎస్‌తో నడిచే కార్లు హైవేలపై రోజుకు 20 కిలోమీటర్ల పరిధిలో ఏ విధమైన టోల్ లేకుండా ప్రయాణించవచ్చని చెప్పింది. పాలసీలో ఈ విధమైన అమెండ్‌మెంట్ వల్ల తక్కువ దూరాలు ప్రయాణించే కార్ల యజమానులకు ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు కల్పించినట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వం వివరించింది.
కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రవేశ పెడుతున్న ది నేషనల్ హైవేస్ ఫీ అమెండ్‌మెంట్ రూల్స్- 2024 ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రైవేట్ కార్ల యజమానులకు లబ్ధి చేకూరుతుందని సదరు శాఖ అధికారులు పేర్కొన్నారు. GNSS నావిగేషన్ సిస్టమ్‌ను ఉపయోగించుకొని నడిచే ప్రైవేట్ కార్లు ఆ రోజు మొత్తంలో ఒక వేళ 20 కిలోమీటర్లు దాటి ప్రయాణిస్తే ఆ మేరకు టోల్ ను క్యాలిక్యులేట్ చేసి యజమానుల నుంచి కలెక్ట్ చేసేలా హైవే టోల్ సిస్టమ్‌లో మార్పులు జరగనున్నాయి. ఈ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర రవాణాశాఖ వర్గాలు చెప్పాయి.
నేషనల్ పర్మిట్ ఉన్న వాహనాలు మినహ ఏ ప్రైవేటు కార్లైనా.. హైవేల మీద, టన్నెల్స్ ద్వారా.. లేదా బ్రిడ్జ్‌ల మీద ప్రయాణించినప్పుడు జీఎన్‌ఎస్‌ఎస్ ఆధారిత టోల్ వ్యవస్థ ద్వారా వారికి జీరో ఫ్రీ టోలు ఉంటుందని తెలిపింది. అయితే అది ఆ రోజులో 20 కిలోమీటర్ల ప్రయాణానికి లోబడి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఈ తరహా వ్యవస్థ ద్వారా టోల్ గేట్లు దగ్గర వాహనదారుల పడిగాపులకు పరిష్కారం దొరకడం సహా భారత హైవేలపై ప్రయాణాన్ని సులభతరం చేయడం సాధ్యమవుతుందని అమెండ్‌మెంట్ పాలసీలో కేంద్రం వివరించింది.
టోల్ గేట్ల దగ్గర జీఎన్‌ఎస్‌ఎస్ వెహికిల్స్ కోసం ప్రత్యేక లేన్:
జియో నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత కార్ల కోసం టోల్ గేట్ల దగ్గర ప్రత్యేక లేన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఒక వేళ ఈ లేన్ లోకి జీఎన్‌ఎస్‌ఎస్ ఆన్ బోర్డ్ కాని వాహనాలు ప్రవేశిస్తే సాధారణ టోల్‌కు రెండింతలు వారి నుంచి వసూలు చేసేలా కఠిన నిబంధనను కూడా చేర్చారు. మొదట ఒక లేన్‌తో మొదలు పెట్టి క్రమంగా టోల్‌గేట్లలోని లేన్‌లు అన్నీ జీఎన్‌ఎస్‌ఎస్ ఆధారిత వ్యవస్థతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఈ విధమైన వ్యవస్థకు సంబంధించి ఈ ఏడాది మొదట్లో ప్రకటన చేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. కొత్త వ్యవస్థ ద్వారా ఎంత మేరకు ప్రయాణించారో అంతే మొత్తం టోల్‌గా చెల్లించే వెసులుబాటు వస్తుందని.. కొద్ది దూరాలకే టోల్ చెల్లించే బాధలకు కాలం చెల్లుతుందని అన్నారు. అన్న మాట ప్రకారం మోదీ సర్కారు ఈ విధమైన మార్పులతో పాలసీని రూపొందించింది. త్వరలో ఇది అమల్లోకి రానుంది.
GNSS అంటే ఏంటీ?
జియో నావిగేషన్ లేదా సాట్నావ్ సిస్టమ్ అనేది ఒక ప్రాంతం, లేదా ఒక వస్తువు ఎక్కడ ఉందే కచ్చితంగా తెలుసుకనేందుకు ఉపకరిస్తుంది. గ్లోబల్ కవరేజీతో ఉన్న శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌ను గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటారు. ఇందులో వ్యవస్థలు పనిచేస్తున్నాయి: అమెరికాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(GPS), రష్యాకు చెందిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్( GLONASS ), చైనాకు చెందిన బీడౌ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (BDS), యూరోపియన్ యూనియన్‌కు చెందిన గెలీలియో . మనం ప్రతిరోజూ ఉపయోగించే కమ్యూనికేషన్ సిస్టమ్‌ల నుంచి Google Maps వంటి మొబైల్ నావిగేషన్ అప్లికేషన్‌ల వరకు అన్నీ దీని ఆధారంగానే పని చేస్తుంటాయి. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) అనేది నావిగేషన్, పొజిషనింగ్ కొలతల కోసం ఉపయోగిస్తారు. దీని వల్ల కచ్చితమైన సమాచారం వస్తుంది.
Also Read: కేంద్ర ఉద్యోగులకు వచ్చే నెల నుంచి ఎక్కువ జీతం, పండగ చేసుకోవచ్చు!