Willow Bats Making in Kashmir: ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది అభిమానించే స్పోర్ట్ క్రికెట్.  అయితే భారత్ లో తయారయ్యే క్రికెట్‌ బ్యాట్లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ లో విల్లో చెట్టుతో తయారుచేసిన బ్యాట్లు వాడుతారు. ఈ విల్లో రెండు రకాలు. ఒకటి ఇంగ్లీష్ విల్లో, రెండవది కశ్మీర్ విల్లో. సాధారణంగా, అంతర్జాతీయ క్రికెటర్లు ఇంగ్లిష్ విల్లోతో తయారుచేసిన బ్యాట్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, కశ్మీర్ విల్లో బ్యాట్లు కూడా ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తున్నాయి. 


కాశ్మీర్ లోని అనంతనాగ్ ప్రాంతంలో కొన్ని వందలాది కుటుంబాలు ఈ కాశ్మీర్ విల్లో బ్యాట్లు తయారు చెస్తూ తమ జీవనం సాగిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కాశ్మీర్ విల్లో బ్యాట్లు తయారు చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని చెబుతున్నారు ఇక్కడ బ్యాట్ తయారీదారులు. 




కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారీలో అనుసరించే విధానాలు:


కశ్మీర్ విల్లో బ్యాట్ల తయారీలో అనేక దశలు ఉంటాయి. ఈ ప్రక్రియ కశ్మీర్ లోని అడవుల నుండి నాణ్యమైన విల్లో చెట్టు ఎంపికతో మొదలవుతుంది. 


1. విల్లో ఎంపిక (Tree Selection): విల్లో చెట్లతో కాశీర్ విల్లో బ్యాట్ లను తయారు చేస్తారు. సాధారణంగా 10 నుండి 15 సంవత్సరాలు వయసు గల విల్లో చెట్లను బ్యాట్ల తయారికి వాడుతారు. 




2. కట్టింగ్ & సీజనింగ్ ప్రక్రియ (Cutting & Seasoning Process): 


ఈ దశ లో ఎంపిక చేసిన విల్లో చెట్లను జాగ్రత్తగా కత్తిరిస్తారు. నాణ్యత, గ్రేడ్ ఆధారంగా మంచి చెట్లను ఎంపిక చేస్తారు. కత్తిరించిన చెట్లను రెండు సంవత్సరాల పాటు ఎయిర్-డ్రై చేయడం ద్వారా తేమ తగ్గి క్రికెట్ ఆడేందుకు అనుకూలంగా మారుస్తారు. ఎయిర్-డ్రై చేసిన లాగ్‌లను చిన్న చెక్కలుగా కోస్తారు. 




3. బ్యాట్ షేపింగ్ (Bat Shaping): 


విల్లో చెక్కలు బ్యాట్ ఆకారంలో కట్టింగ్ చేసిన తరువాత బ్యాట్ యొక్క బ్లెడ్, హ్యాండిల్ ఆకారాలను కూడా చెక్కుతారు. బ్యాట్ తయారు చేసే ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన బ్లేడ్, హ్యాండిల్‌ తయారీలో కచ్చితమైన పరిమాణాలను సాధించేందుకు వివిధ యంత్రాలు ఉపయోగించి బ్యాట్ లను షేప్ చేస్తారు.




4. ప్రెసింగ్ (Pressing):  బ్యాట్ బ్లేడ్‌ను మెకానికల్ ప్రెస్ ఉపయోగించి ప్రెస్ చేస్తారు. ఈ ప్రక్రియ బ్యాట్ క్వాలిటీ అండ్ బాల్ ఇంపాక్ట్ ను తట్టుకోవడానికి ఉపయోగ పడుతుంది. బ్లెడ్ ప్రెసింగ్ ప్రక్రియ బ్యాట్ పనితీరును, మన్నికను మెరుగుపరుస్తుంది.


5. గ్రేడింగ్ (Grading):  విల్లోలో ఉండే గ్రైన్స్ ను బట్టి బ్యాట్ లను తగిన విధాలుగా చెక్కుతారు. బ్యాట్ గ్రైన్స్ & నాణ్యత ఆధారంగా బ్యాట్లను  గ్రేడింగ్ ప్రక్రియ చేస్తారు.




6. సాన్డింగ్ (Sanding): చివరగా బ్యాట్‌ను నున్నగా మార్చడానికి సాండింగ్ పద్ధతి ఉపయోగిస్తారు. ఇది బ్యాట్‌ కు పాలిష్డ్ లుక్ ను ఇస్తుంది.


7. హ్యాండిల్‌ ఫిట్టింగ్ (Handle Fitting):
బ్యాట్ హ్యాండిల్ లను బ్లేడ్‌లో సక్రమంగా అమర్చడానికి నాణ్యమైన వుడ్ గ్లూ ఉపయోగించి హ్యాండిల్ ను బ్యాట్ బ్లెడ్ కు ఫిట్ చేస్తారు.


8. ఫినిషింగ్ (Finishing): బ్యాట్ హ్యాండిల్ ను అతికించాక బ్యాట్‌ కు ఫినిషింగ్ ప్రక్రియలో బాగంగా బ్యాట్ ఆయిలింగ్ తో పాటు వానిష్‌లు అప్లై చేస్తారు. ఇది బ్యాట్‌ను తేమ నుంచి సంరక్షించడానికి సహాయపడుతుంది. 




9. క్వాలిటీ తనిఖీలు: (Quality Check): చివరగా బ్యాట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో సరిచూసుకుంటారు. బ్యాట్‌లను పరీక్షించి వాటి స్థాయి, బరువు, బ్లెడ్ వెడల్పు మొదలైన అంశాలను పరిశీలిస్తారు. 


10. డిస్ట్రిబ్యూషన్ (Distribution): చివరగా తయారైన కాశ్మీర్ విల్లో బ్యాట్‌లు రిటైల్ స్టోర్లకు, క్రికెట్ క్లబ్స్‌కు పంపబడతాయి.


ఈ విధంగా విల్లో చెట్టు ఎంపిక నుండి చివరి తనిఖీ వరకు అనేక ప్రక్రియలు పూర్తి చేశాకే కాశీర్ విల్లో బ్యాట్ తయారవుతుంది. 




కాశ్మీర్ లోని అనంత నాగ్ ప్రాంతంలో ఉన్న  GR8 స్పోర్ట్స్ దేశీయ బ్యాట్ లకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు తమ వంతు కృషి చేస్తోంది. 1971 లో స్థాపించిన GR8 స్పోర్ట్స్ 2021లో ICC (International Cricket Council) నుంచి ఆమోదం పొందిన మొదటి కశ్మీర్ విల్లో బ్యాట్ మ్యాన్యుఫాక్చరింగ్ స్టోర్ గా గుర్తింపు పొందింది. 




ఓమాన్, ఆఫ్ఘనిస్థాన్, వెస్ట్ ఇండీస్ జట్ల లోని కొందరు ఆటగాళ్ళు వరల్డ్ కప్ టోర్నమెంట్ల కోసం GR8 కశ్మీర్ విల్లో బాట్‌లను ఎంచుకున్నారు. దీనితో కాశ్మీర్ విల్లో బ్యాట్లకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తోంది. 


సాధారణంగా కశ్మీర్ విల్లో బ్యాట్లు, ఇంగ్లిష్ విల్లో బ్యాట్ల తో పోలిస్తే మూడు రెట్లు తక్కువ ధర కలిగి ఉంటాయి. అయితే బ్యాట్ తయారీ విధానం, నాణ్యత లో ఏటువంటి లోపాలు ఉండవని చెబుతున్నారు GR8 స్పోర్ట్స్ అధినేత ఫావ్జుల్ కబీర్ (Fawzul Kabiir). కాశ్మీర్ విల్లో బ్యాట్లు తయారీతో కశ్మీరీ కళాకారుల నైపుణ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని GR8 స్పోర్ట్స్ అధినేత కబీర్ తెలిపారు.