Toll Collection News: కేంద్ర ప్రభుత్వం టోల్ ఫీజుల కలెక్షన్ విషయంలో శుభవార్త వినిపించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం (సెప్టెంబర్ 10) నేషనల్ హైవేస్ ఫీజు (రేట్స్, కలెక్షన్) రూల్స్, 2008ను సవరించింది. ఇందులో శాటిలైట్ ఆధారిత వ్యవస్థల ద్వారా ఎలక్ట్రానిక్ టోల్ వసూలు చేసే విధానాన్ని చేర్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఈ సవరణలు టోల్ వసూలుకు సరికొత్త పద్ధతిగా ఉంటాయి. అంటే ఆన్-బోర్డ్ యూనిట్స్ తో (OBUs) యునైటెడ్ స్టేట్స్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS)తో సహా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ద్వారా టోల్ కలెక్షన్ త్వరలో జరగనుంది. ఫాస్ట్ ట్యాగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) టెక్నాలజీ వంటి వ్యవస్థలు ఇప్పటిదాకా మన దేశంలో అమలులో ఉన్న సంగతి తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ తాజా సవరణలతో GNSSతో కూడిన OBUలను కలిగి ఉన్న వాహనాలు వారు ప్రయాణించే దూరం ఆధారంగా ఆటోమేటిక్‌గా టోల్ ఫీజులను సులభతరమైన కొత్త విధానం ద్వారా చెల్లించవచ్చు. 2008 చట్టం నిబంధనలలోని రూల్ 6.. GNSS పరికరాలతో వాహనాల కోసం టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకమైన లేన్‌లను రూపొందించాల్సి ఉంటుంది. OBU డివైజ్‌లు లేని వాహనాలు పాత పద్ధతుల్లో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ ఫీజులను చెల్లించవచ్చు.
అధికారిక గెజిట్‌లో ప్రచురించిన, సవరించిన వివరాల ప్రకారం.. సరికొత్త అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేషనల్ హైవేలపై టోల్ వసూలును కలెక్ట్ చేయనున్నారు. అయితే, మన దేశంలో రిజిస్టర్ కాని, లేదా GNSS పరికరాలు పని చేయని వాహనాలకు పాత టోల్ రేట్ల వసూలు విధానాలనే కొనసాగిస్తామని రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, GNSS వ్యవస్థను ఉపయోగించే వాహనాల కోసం 20 కి.మీ వరకు జీరో-టోల్ ఫీజు విధానాన్ని తీసుకురానున్నారు. 20 కిలో మీటర్లు మించి ప్రయాణిస్తే టోల్ కట్టాల్సి ఉంటుంది.
GPS ఆధారిత టోల్ సేకరణ అంటే ఏమిటి?
టోల్ గేట్ల వద్ద ఏర్పాటు చేసిన బూత్‌లలో టోల్ ఫీజులను మాన్యువల్ గా చెల్లించడం మనకు తెలుసు. దీనివల్ల తరచూ టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఫాస్ట్ ట్యాగ్‌ని ఉపయోగించడం వల్ల కూడా కొన్ని సార్లు ట్రాఫిక్ జామ్ ఉంటోంది. కానీ, GPS-ఆధారిత టోల్ సిస్టమ్.. వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్‌లను కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందుకు శాటిలైట్ నావిగేషన్ తో పాటు వాహనంలో ఉండే ట్రాకింగ్ సిస్టమ్ పరికరం ద్వారా ఈ విధానం సాధ్యపడుతుంది. ఇలా శాటిలైట్ బేస్డ్ ట్రాకింగ్, GPS సాంకేతికతను ఉపయోగించుకొని వాహనం కవర్ చేసే దూరానికి అనుగుణంగా టోల్‌లను ఛార్జీలు ఆటోమేటిగ్గా కలెక్ట్ చేస్తారు. ఈ సాంకేతికత టోల్ ప్లాజాల అవసరం లేకుండా చేయడమే కాకుండా.. ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని కూడా తగ్గిస్తుంది.
ఇది ఫాస్ట్ టాక్ తో పోల్చితే ఎలా భిన్నంగా ఉంటుంది?
శాటిలైట్ బేస్డ్ టోల్ సిస్టమ్ అనేది GNSS సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఇది కచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్‌ను చేయగలదు. ఇది మరింత కచ్చితమైన డిస్టెన్స్-బేస్డ్ టోలింగ్ కోసం GPSతో పాటు భారతదేశంపు GPS ఎయిడెడ్ GEO ఆగ్మెంటెడ్ నావిగేషన్ (GAGAN) వ్యవస్థను ఉపయోగించుకుంటుంది.
టోల్ వసూలు కోసం ట్రాకింగ్ పరికరాలుగా పనిచేసే OBUలు అని పిలిచే డివైజ్‌లు వాహనాల్లో అమర్చుతారు. OBU డివైజ్ అనేది హైవేలపై వాహనపు కోఆర్డినేట్‌లను ట్రాక్ చేస్తుంది. ఇవి ప్రయాణించిన దూరాన్ని కచ్చితంగా లెక్కిస్తాయి. ఈ వ్యవస్థను ప్రాథమికంగా కీలకమైన హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో అమలు చేయనున్నారు. OBUలు ఫాస్ట్‌ట్యాగ్‌ల తరహాలోనే ప్రభుత్వ పోర్టల్స్ ద్వారా అందుబాటులో ఉంటాయి. వాహనాల మేకర్స్ ప్రీ ఇన్‌స్టాల్డ్ OBUలతో వాహనాలను అందించడం ప్రారంభించారు.