Ganesh Immersions: హైదరాబాద్‌లో వినాయక ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో గణేష్ నిమజ్జన సందడి మొదలు కానుంది. ఈ నిమజ్జనం కోసం హైదరాబాద్ సిటీ మొత్తం దాదాపుగా హుస్సేన్ సాగర్ లోనే వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ట్యాంక్ బండ్‌పై కనిపిస్తున్న ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. 


గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో చేయడం కుదరదని ఫ్లెక్సీలు పెట్టారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఇక్కడ విగ్రహాల నిమజ్జనం చేయడం కుదరదని ఫ్లెక్సీల్లో స్పష్టం చేశారు. అక్కడికి క్రేన్లు, జేసీబీలు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ ఫ్లెక్సీలు తెలంగాణ పోలీసులు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏర్పాటు చేయించినట్లుగా ఉంది. ఇందులో భాగంగా ట్యాంక్‌ బండ్‌ మార్గంలో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు.  దీంతో వినాయక మండపాలు ఏర్పాటు చేసిన నిర్వహకులతో పాటు.. భక్తులు కూడా అయోమయానికి గురవుతున్నారు. ఏటా ఘనంగా హుస్సేన్ సాగర్‌లో జరిగే నిమజ్జనోత్సవానికి ఈ ఏడాది బ్రేక్ పడినట్టేనా అని భావిస్తున్నారు. 


విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు నో పర్మిషన్
హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాల విషయం ప్రతి ఏటా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. సాగర్ లో నిమజ్జనం కారణంగా కాలుష్యం పెరిగిపోతోందని పర్యావరణవేత్తలు ఏటా హైకోర్టుకు వెళ్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో హుస్సేన్ సాగర్ జలాలు మరింత కలుషితం అవుతున్నాయని వాదిస్తు్న్నారు. ఈ ఏడాది కూడా వినాయక విగ్రహాలు సాగర్‌లో నిమజ్జనం కాకుండా చూడాలని కోర్టుకు వెళ్లారు. 


దీంతో కోర్టు గతంలోనే హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌తో తయారుచేసిన విగ్రహాలు నిమజ్జనాలు చేయకూడదని చెప్పింది. అయినా, వినాయక నిమజ్జనాలు జరిగాయి. దీంతో లాయర్‌ వేణుమాధవ్‌ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలను అమలు అయ్యేలా చూడాలని.. విగ్రహాల నిమజ్జనాన్ని నిలువరించాలని మరో పిటిషన్ వేశారు. అంతేకాకుండా, దీనిలో ప్రతివాదులుగా హైడ్రాను కూడా చేర్చాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఇంతలోనే హుస్సేన్ సాగర్ చుట్టూ ఇనుప కంచెలు వేసి.. నిమజ్జనానికి అనుమతి లేదంటూ బోర్డులు కనిపిస్తున్నాయి.