Kedarnath Landslide: రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు యాత్రికులు మృతి చెందారు. మరికొందరు యాత్రికులు గాయపడ్డారు. సోన్‌ప్రయాగ్, ముంకతియా మధ్య ఈ ఘటన జరిగింది. కొండచరియలు విరిగిపడి ప్రాణనష్టం జరగడంపై ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


కేదార్‌నాథ్‌ను సందర్శించుకున్న కొందరు యాత్రికుల బృందం తిరిగి వెళ్తుండగా సోమవారం రాత్రి 7.20 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని యాత్రికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ అక్కడికి చేరుకుని ముగ్గురు యాత్రికులను రక్షించారు. శిథిలాల కింద కింద ఉన్న ఐదుగురు యాత్రికుల మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో సోన్‌ప్రయాగ్‌కు తరలించారు. 






సోమవారం రాత్రి వాతావరణం అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. నిన్న రాత్రి ఒక యాత్రికుడి మృతదేహాన్ని వెలికితీసిన సిబ్బంది, మంగళవారం ఉదయం ముగ్గురు మహిళలు సహా నలుగురు యాత్రికుల మృతదేహాలను శిథిలాల కింద నుంచి వెలికితీశారు.  చనిపోయిన వారిని మధ్యప్రదేశ్‌లోని ఘాట్ జిల్లాకు చెందిన వారని గుర్తించారు. వైదేహి గ్రామానికి చెందిన తిత్లీ దేవి (70), దుర్గాబాయి ఖాపర్ (50) గా గుర్తించారు. వీరితోపాటు నేపాల్‌లోని ధన్వా జిల్లాకు చెందిన సమన్ బాయి (50), మధ్యప్రదేశ్‌లోని ధార్‌కు చెందిన భరత్ భాయ్ నిరాలాల్ (52) లుగా గుర్తించారు. 


Also Read: టోల్స్ కట్టేవారికి గుడ్‌న్యూస్, కొంత దూరం ఫ్రీ - శాటిలైట్ బేస్డ్ టోల్‌‌ను నోటిఫై చేసిన కేంద్రం