DA Hike News Update: లక్షల మంది కేంద్ర ఉద్యోగులు అతి త్వరలోనే ఒక గుడ్‌న్యూస్‌ వినబోతున్నారు. పండుగ సీజన్‌ కంటే ముందే మోదీ ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను (dearness allowance) పెంచుతుందని సమాచారం. దీనివల్ల, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్టోబర్‌లో ఎక్కువ జీతం తీసుకుంటారు.


త్వరలో కేంద్రం నుంచి ప్రకటన
నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ను బట్టి చూస్తే, కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కరవు భత్యం పెంపుదల (DA Hike) గురించి ప్రకటించవచ్చు. డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు డియర్‌నెస్ రిలీఫ్ (DR) కూడా పెరగబోతోంది. ప్రస్తుతం విధుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ ప్రయోజనం పొందుతున్నట్లే, మాజీ ఉద్యోగులు (పెన్షనర్లు) డీఆర్‌ ప్రయోజనాన్ని పొందుతున్నారు.


'డీఏ హైక్‌'ను ఈ నెలాఖరున (సెప్టెంబర్‌ 2024) ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 7వ వేతన సంఘం (7th Pay Commission) కింద వేతనాలు పొందుతున్న కేంద్ర ఉద్యోగులు, పింఛను తీసుకుంటున్న పెన్షనర్లు దీని ద్వారా నేరుగా లబ్ధి పొందుతారు. 2024 జనవరి నుంచి 50 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను కేంద్రం ఇస్తోంది.


DA పెంపు 3%?
2024 జనవరి నుంచి జూన్ వరకు AICPI-IW ఇండెక్స్ నంబర్లను బట్టి, 2024 జులై నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో 3 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను పొందొచ్చు. జూన్ AICPI ఇండెక్స్‌లో 1.5 పాయింట్ల మేర జంప్ కనిపించింది. మేలో 139.9 పాయింట్ల వద్ద ఉండగా, జూన్‌లో 141.4కి పెరిగింది. ఫలితంగా డియర్‌నెస్ అలవెన్స్ స్కోరు 53.36గా మారింది. దీనినిబట్టి, ఈసారి డియర్‌నెస్ అలవెన్స్‌లో 3 శాతం పెంపు ఉంటుందని చెబుతున్నారు. జనవరిలో, ఇండెక్స్ నంబర్‌ 138.9 పాయింట్లకు చేరింది, అప్పటి డీఏ 50.84 శాతానికి పెరిగింది.


కేంద్ర ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ పెంపుపై సెప్టెంబర్ చివరిలో ప్రకటన వెలువడుతుంది. అయితే, ఈ పెంపు జులై 2024 నుంచీ అమలవుతుంది. ఈ మధ్యలో ఉన్న కాలానికి చెల్లింపును బకాయిగా మారుస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, కేంద్ర ఉద్యోగులు & పెన్షనర్లకు 53 శాతం డియర్‌నెస్ అలవెన్స్/ డియర్‌నెస్‌ రిలీఫ్‌ చెల్లిస్తారు. ఈ నెల 25న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిని ప్రకటించవచ్చు. మంత్రివర్గ ఎజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చారు. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుంది.


మూడు నెలల బకాయి కూడా..
నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, డియర్‌నెస్ అలవెన్స్‌ హైక్‌ను ఈ నెలాఖలో ప్రకటించి అక్టోబర్ జీతంతో కలిపి చెల్లిస్తారు. ఆ నెలలో ఉద్యోగులు & పెన్షనర్లు కూడా 3 నెలల బకాయి (జులై, ఆగస్టు, సెప్టెంబర్‌) పొందుతారు. ఈ బకాయిలు గత డీఏకి-కొత్త డీఏకి మధ్య వ్యత్యాసంగా ఉంటుంది. ఇప్పటి వరకు 50 శాతం డీఏ, డీఆర్‌లు అందుతున్నాయి. అది 53 శాతానికి పెరిగితే, 3 శాతం బకాయిలను కేంద్రం చెల్లిస్తుంది. 


ప్రతి సంవత్సరం రెండుసార్లు డియర్‌నెస్ అలవెన్స్‌ను సవరిస్తారు. ఈ ఏడాది, డియర్‌నెస్ అలవెన్స్ పెంపుదలను మార్చి నెలలో ప్రకటించారు. ఆ సమయంలో, కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ & డియర్‌నెస్ రిలీఫ్ రెండింటి రేట్లను 4 శాతం చొప్పున పెంచింది. దీంతో, డీఏ, డీఆర్‌ల రేటు 50 శాతానికి పైగా పెరిగింది. మార్చిలో ప్రకటించిన పెంపు జనవరి నుంచి అమలులోకి వచ్చింది.