Viral Video: దేశవ్యాప్తంగా కురుస్తోన్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఎన్నో చోట్ల వాహనాలకు వాహనాలే వరదలో కొట్టుకుపోయాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వరద ఉద్ధృతికి ఎదురెళ్లి తనతో పాటు మావటి వాడి ప్రాణాలు కాపాడింది ఓ ఏనుగు.
ఏం ధైర్యం?
బిహార్‌లోని వైశాలి జిల్లా రాఘవ్‌పుర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గంగా నది ఉప్పొంగింది. అదే సమయంలో వరద నీటి ప్రవాహంలో ఓ ఏనుగు చిక్కుకుంది.
పీకల్లోతు మునిగిన ఆ ఏనుగుపై మావటివాడు కూడా ఉన్నాడు. అయితే, ఏనుగుతో సహా మావటివాడు ఒక్కసారిగా ఉప్పొంగిన వరద కారణంగా గంగా నదిలో కొంత దూరం కొట్టుకుపోయారు. అయినా ఆ ఏనుగు మాత్రం ఆశలు వదులుకోలేదు.
తల వరకు మునిగిన ఆ ఏనుగు నది ఉద్ధృతికి ఎదురెళ్లి సుమారు మూడు కిలోమీటర్లు ఈదింది. చివరకు ఒక చోట నది మలుపులో కొందరు వ్యక్తులు ఉండటాన్ని మావటివాడు చూసి.. ఒడ్డుకు చేరుకున్నాడు. దీంతో ఏనుగు, మావటివాడు నది ప్రవాహం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఏనుగుకు సలాం చెబుతున్నారు. కొంతమంది ఏనుగుకు అవార్డు ఇవ్వాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Delhi High Court: భర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న భార్యలు- దిల్లీ హైకోర్టు సీరియస్!
Also Read: Uttar Pradesh: వర్షాలు కురవాలని ఎమ్మెల్యేకు బురద స్నానం చేయించిన ప్రజలు!