Uttar Pradesh News: ఉత్తర్‌ ప్రదేశ్ ఝాన్సీలోని శివగణేశ్ కాలనీలో ఓ పెంపుడు కుక్క చేసిన సాహసం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎప్పుడూ పిట్‌బుల్ బ్రీడ్‌ కుక్క జనంపై దాడి చేసిన ఘటనల వార్తలే వింటుంటాం. ఇది మాత్రం దానికి విరుద్ధం. ప్రజలను కాపాడిన పిట్‌బుల్ బ్రీడ్ కుక్క కథ. ఘాన్సీలోని  శివగణేశ్ కాలనీలోని ఓ ఇంట్లోని గార్డెన్‌లోకి కింగ్ కోబ్రా ప్రవేశించింది. గొడపక్కనే పాకుతూ వస్తోంది. దానికి సమీపంలోనే ఆ ఇంట్లో పనిచేసే వాళ్ల పిల్లలు ఆడుకుంటున్నారు. పామును చూసి ఒక్క సారిగా ఆ పిల్లలు భయాందోళనతో కేకలు వేశారు.


ఈ మొత్తం ఘటనను మరోవైపున ఉన్న పెంపుడు కుక్క జెన్నీ చూసింది. ఆ పిట్ బుల్ బ్రీడ్ కుక్క వెంటనే రంగంలోకి దిగింది. చిన్నారులకు ఆ పాము అపాయం చేస్తుందేమో అన్న భయంతో వెంటనే ఆ కింగ్ కోబ్రా పైకి దాడికి దిగింది. నోటితో పామును పట్టుకొని కొరికింది. ఆ కింగ్ కోబ్రాకు తేరుకునే సమయం కూడా ఇవ్వకుండా నోటితో పట్టి గుంజింది. ఇలా దాదాపు 5 నిమిషాల పాటు ఆ రెండింటి మధ్య యుద్ధం జరిగింది. మధ్య మధ్యలో రాచనాగు తిరిగి దాడి చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ జెన్నీ నేలకేసి కొట్టే ప్రయత్నం చేయడం ఆ వీడియోలో మనకు కనిపిస్తుంది. కింగ్‌ కోబ్రా ఎంత ప్రయత్నించినప్పటికీ జెన్నీ పట్టు నుంచి తప్పించుకోలేక పోయింది. పామును నోటితో కొరికిన జెన్ని తర్వాత పక్కన పడేసింది. ఆ పాము కదలకుండా పడి ఉండడం వీడియోలో కనిపించింది.






పాము ఇంట్లోకి వచ్చుంటే ఏం జరిగేదో ఊహించలేము:


ఒక వేళ ఆ కింగ్ కోబ్రా జెన్నీ కళ్లల్లో పడకుండా ఇంట్లోకి వచ్చి ఉంటే ఏం జరిగేదో ఊహించలేమని ఆ జెన్నీ ఓనర్ పంజాబ్ సింగ్ తెలిపారు. ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లో లేనని అన్నారు. జెన్నీ ఇంతకు ముందు కూడా పాములను చంపిందని పంజాబ్‌ సింగ్ చెప్పారు. వర్షా కాలంలో ఇరుగు పొరుగు ఇళ్లల్లోకి పాములు వస్తుంటాయన్నారు. ఆ సమయంలో జెన్నీ వాటిని చంపిందని అన్నారు. ఇప్పటి వరకూ జెన్నీ 8 నుంచి 10 పాములను చంపి చుట్టు పక్కల వాళ్ల ప్రాణాలు కాపాడిందని పంజాబ్ సింగ్ గర్వంగా చెబుతున్నారు.


ప్రస్తుత కాలంలో ప్రజలు పెంపుడు జంతువులకు దూరంగా ఉంటున్నారని ఆయన అన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. జంతువులను ప్రేమించాలని సూచిస్తున్నారు. మనుషులు చేసే పనులు కూడా ఈ యానిమల్స్ కొన్ని చేయగలవని జెన్నీ నిరూపించిందన్నారు. పిట్‌బుల్స్ గురించి చాలా మంది చాలా నెగెటివ్‌గా చెబుతుంటారని అన్నారు. తాను మాత్రం ఇంతవరకు అటువంటి ఘటనలను ఎదుర్కోలేదని అన్నారు. పైపెట్టు తన జెన్నీ ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని చెప్పొకొచ్చారు.


పిట్‌బుల్ డాగ్స్ పెంచుకోవడంపై కొందరు భయాందోళన వ్యక్తం చేస్తుంటారు. గతంలో అనేక సార్లు ఈ పిట్‌ బుల్ డాగ్స్ జనాలపై దాడులకు దిగిన ఘటనలు కూడా ఉన్నాయి. వాటికి సరైన శిక్షణ లేకపోవడంతోనే ఈ తరహా దాడులకు దిగుతున్నట్లు డాగ్ లవర్స్ చెబుతుంటారు. జోషువా డిక్సన్ అనే అమెరికన్ బాలుడిపై ఈ పిట్‌బుల్‌ డాగ్ చేసిన తీవ్రమైన దాడిలో 80 శాతం వరకూ అతడి ముఖంపై చర్మం కోల్పోవాల్సి వచ్చింది. లక్నోలో పిట్‌బుల్ దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందగా.. కర్నాల్‌లో జరిగిన ఓ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. పిట్‌బుల్స్ గురించి ఈ విధంగా నెగెటివ్ విషయాలు ఉన్నప్పటికీ ఝాన్సీలోని  ఈ జెన్నీ మాత్రం ఎంతో ప్రత్యేకమని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Also Read: సిద్ధి వినాయక ప్రసాదంలో ఎలుక పిల్లల వీడియో వైరల్‌- ఆలయ ట్రస్ట్ సమాధానం ఏంటంటే?