Viral Video On Ganesh Prasadam: ఆలయాల్లో ప్రసాదాలపై ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో ముంబయి సిద్ధి వినాయకుడి ఆలయ ప్రసాదంలో ఎలుక ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వీడయో వైరల్ కావడం దుమారం రేపుతోంది. ఈ వీడియోపై స్పందించిన శ్రీ సిద్ధి వినాయక గణపతి టెంపుల్ ట్రస్టు ఈ ఘటనను కొట్టిపారేసింది. ఇది ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా సృష్టించిన వీడియో అని వ్యాఖ్యానించింది. ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఆలయ ట్రస్టు తెలిపింది. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ఆలయ ట్రస్టు స్పష్టం చేసింది.  


ఘటనపై డీసీపీ ర్యాంకు అధికారితో విచారణ:


            తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆలయాల ప్రసాదం విషయంలో ప్రతి చిన్న అంశమూ వైరల్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముంబయిలోని శ్రీ సిద్ధి వినాయక గణపతి టెంపుల్లో లడ్డూల కవర్లు ఉన్న ప్రదేశంలో ఎలుక పిల్లలు ఉన్నాయన్న వీడియో వైరల్ అయింది. ఆ కవర్ల మధ్యలో ఎలుక కనిపిస్తున్న వీడియో ఘటనను ఆలయం సీరియస్‌గా తీసుకొని విచారణకు ఆదేశించింది.






            ఈ ఘటనపై స్పందించిన శివసేన నేత, ఆలయ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సదా సార్వంకర్‌ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. రోజూ లక్షల లడ్లు భక్తులకు ఇస్తుంటామన్నారు. ఆ లడ్డూ ప్రసాదం తయారు చేసే ప్రదేశం ఎంతో క్లీన్‌గా ఉంటుందని సదా తెలిపారు. వీడియోలో ఉన్న ప్రదేశం పూర్తి డర్టీగా ఉందన్నారు. ఇది ఎక్కడో ఆలయం వెలుపల షూట్ చేసిన వీడియోగా పేర్కొన్నారు. ఆలయ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తామన్నారు. డీసీపీ ర్యాంకు అధికారితో ఘటనపై విచారణ చేపడతామన్నారు. ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ ఛైర్‌పర్సన్ స్పష్టం చేశారు. ఇక్కడ ప్రసాదం తయారీలో వాడే ఘీ, జీడిపప్పుతో పాటు ఇతర అన్ని పదార్థాలను బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ల్యాబ్‌లో ఎప్పటికప్పుడు పరీక్షలు చేపిస్తామని చెప్పారు. అఖరికి ఆలయంలో వాడే నీరు కూడా పరీక్షలు నిర్వహించిన తర్వాతే వాడతామన్నారు. కాబట్టి ఆ వీడియో ఎవరో ఆలయం వెలుపల మురికి ప్రదేశంలో చిత్రీకరించినట్లు ఆ వీడియో చూస్తే ఇట్టే తెలిసి పోతుందని సదా అన్నారు. ఆ వీడియోలో ఒక బ్లూ ట్రేలో లడ్డూ ప్యాకెట్లు ఉన్నాయి. వాటి పక్కనే ఒక పాలితీన్ కవర్లో చిట్టి ఎలుకలు కొన్ని ఉన్నాయి.






            తిరుమల లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ అవశేషాలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ మరుసటి రోజే తెలుగుదేశం పార్టీ గుజరాత్‌ ఎన్‌డీడీసీ ఇచ్చిన రిపోర్టులను బయట పెట్టగా దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఈ ఘటనపై ఐజీ ర్యాంకు అధికారితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ఘటనకు సంబంధించి సీబీఐతో విచారణ చేపట్టేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులోనూ టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తరపున పిల్ కూడా దాఖలైంది. ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్‌లోని అధికార విపక్షాలు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ ఘటనకు పరిహారంగా తిరుమల ఆలయంలో శాంతి పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ కాలినడకన తిరుమలకు వెళ్లారు.