Tamil Nadu News: తమిళనాడులోని రాణిపేట జిల్లా ఆరణి సమీపంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోయారు. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్‌ నడుపుతున్న వాహనాన్ని చెట్టుకు ఢీ కొట్టాడు. ప్రమాద సమయంలో ఆ వ్యాన్‌లో 20 మంది ట్రావెల్ చేస్తున్నారు. 


వజైపండల్ ప్రాంతానికి చెందిన 20 మంది భక్తులు టుటికోరిన్ జిల్లా తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. తిరుచ్చి-చెన్నై జీఎస్టీ రోడ్డులో వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్‌పేట మెట్టటూరు సమీపంలోకి రాగానే వాహనం అదుపు తప్పింది. అతివేగంతో ఉన్న వాహనం అదుపు తప్పడంతో రోడ్డుకు ఎడమవైపు ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. 


ప్రమాదం జరిగిన వాహనంలో ఉన్న ఇద్దరు మహిళలు సహా ఆరుగురు స్పాట్‌లోనే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనం బలంగా ఢీ కొట్టడంతో చెట్టుకు వాహనానికి మధ్య బాధితులు ఇరుక్కుపోయారు. జేసీబీ సహాయంతో బాధితులను బయటకు తీశారు. 




క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన 13 మందికి విల్లుపురం ముండియంబాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చెట్టులో ఇరుక్కున్న వాహనాన్ని కూడా అతి కష్టమ్మీద పగులగొట్టి తొలగించారు. 


ఈ ప్రమాదంతో తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదానికి గురైన వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను పోలీసులు పునరుద్దరించారు. కళ్లకురిచ్చి జిల్లా ఎస్పీ రజత్ చతుర్వేది కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పోలీసులు.