ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0, అమృత్ 2.0 ఆమోదం లభించింది. అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ 2.0 (అమృత్ 2.0) ని 2025-26 వరకు ఆమోదించింది.
స్వచ్ఛ భారత్ 2.0కు లక్షా 41 వేల 6వందల కోట్ల వ్యయంగా కెబినెట్ ఖరారు చేసింది. తొలిదశలో ఖర్చు చేసిన దానితో పోలిస్తే.. దాదాపు రెండున్నర రెట్లు అధిక వ్యయంగా ఉంది. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేయడమే లక్ష్యంగా ముందుకు సాగనుంది కేంద్రం. అమృత్ 2.0 అమలుకు 2 లక్షల 77వేల కోట్ల వ్యయంగా కేంద్ర కెబినెట్ ఖరారు చేసింది. ఇందులో కేంద్రం వాటా 76వేల 700 కోట్లని అధికారు తెలిపారు.
అమృత్ 2.0..
అమృత్ 2.0.. కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఉన్న 4,700 పట్టణ స్థానిక సంస్థల్లో 2.68 కోట్ల నల్లా కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తారు. 500 అమృత్ పట్టణాల్లో ఇళ్లకు కనెక్షన్లు ఇస్తారు. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో ఉన్న 10.5 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.
ఉపరితల, భూగర్భ జలాలను సంరక్షించడంతో పాటు, వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం ప్రపంచస్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఈ మొత్తం కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.77 లక్షల కోట్లు కేటాయించింది.
నగరాలను చెత్త రహితంగా చేయడమే స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.O లక్ష్యం. నగరాలన్నింటిలో నీటి సంరక్షణ చర్యలు కూడా చేపట్టనున్నారు. బురదనీరు చెరువుల్లో చేరకుండా చర్యలు చేపట్టనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను అందుకోవడంలో స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.Oకీలకంగా నిలుస్తుందని కేంద్రం చెబుతోంది.
ఏం చేస్తారు?
- స్వచ్ఛ భారత్ (పట్టణ) కింద పట్టణాలను మురుగు నుంచి విముక్తి కల్పిస్తారు.
- అమృత్ పథకం పరిధిలోకి రాని అన్ని పట్టణ ప్రాంతాల్లో మురికి నీటి నిర్వహణ చేపడతారు.
- అన్ని పట్టణ స్థానిక సంస్థలను బహిరంగ మల విసర్జన రహితంగా మారుస్తారు.
- ఘన వ్యర్థాలను అవి ఉత్పత్తి అయ్యేచోటే వేరు చేయడంపై దృష్టి సారిస్తారు.
- వాటిని తగ్గించడం, పునర్వినియోగించడం, పునఃశుద్ధి చేయడం గురించి ఆలోచిస్తారు.
- మున్సిపాల్టీల్లో వెలువడే అన్నిరకాల వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధిచేసి, వాటిని సమర్థవంతంగా వినియోగిస్తారు.
Also read: శునకాలు మరణాన్ని ముందే పసిగడతాయా? వాటి అరుపులతో ఆ విషయాన్ని మనకు తెలియజేస్తాయా?
Also read: ఈ అలవాట్లు మానుకోండి... లేకుంటే కిడ్నీలకు ప్రమాదం తప్పదు