Manik Saha sworn in as Tripuras new chief minister: త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఎస్ఎన్ ఆర్య మాణిక్ సాహాతో రాజ్‌భవన్‌లో నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. బిప్లవ్ కుమార్ దేవ్ సీఎం పదవికి శనివారం రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ కేంద్ర అధిష్టానం కొత్త సీఎంను ఎంపిక చేసింది. సాయంత్రం బిప్లవ్ కుమార్ దేవ్ సీఎం పదవి నుంచి తప్పుకోగా, త్రిపుర బీజేపీ అధ్యక్షుడు మాణిక్ సాహాను లెజిస్లేచరీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
తనకు పార్టీ ఎమ్మెల్యేల మద్దుతు ఉందని సీఎంగా ప్రమాణం చేసేందుకు అవకాశం కల్పించాలని మాణిక్ సాహా శనివారం గవర్నర్ ఎస్ఎన్ ఆర్యను కలిశారు. రాజ్యసభ సభ్యుడు అయిన మాణిక్ సాహాతో నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. త్రిపుర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్‌కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ అధిష్టానం సీఎం మార్పుతో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారిన నేతకు సీఎం పదవి దక్కడం ఆ పార్టీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అధిష్టానం నిర్ణయం, మరోవైపు ఎమ్మెల్యేల మద్దతు కూడకట్టడంలో ఆయన సక్సెస్ అయ్యారు.
ఎవరీ మాణిక్ సాహా..
మాణిక్ సాహా (69) వృత్తిపరంగా ఓ దంత వైద్యుడు (Dental Surgeon). కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయనను బీజేపీ అధిష్టానం ఈ ఏడాది మొదట్లో త్రిపుర నుంచి రాజ్యసభకు పంపించింది. త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా 2020లో ఎన్నికయ్యారు. 2016లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు మాణిక్ సాహా. ఆయన ప్రొఫెసర్, త్రిపుర మెడికల్ కాలేజీ, బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ టీచింగ్ హాస్పిటల్‌కు హెడ్‌గా వ్యవహరించారు. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ సేవలు అందించారు.
ఢిల్లీ పెద్దల సూచన.. బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా
త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తాజాగా ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలతో భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి శనివారం అగర్తలాకు తిరిగొచ్చిన బిప్లవ్ దేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర అధిష్టానం సూచన మేరకు సీఎం పదవికి బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తూనే, రాజ్ భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ కేంద్ర అధిష్టానం కీలక మార్పు కోరుకోవడంతో సీఎం పదవి నుంచి బిప్లవ్ దేవ్ రాజీనామా చేశారు.