భార్య నుంచి భర్తకు భరణం ఇప్పించడం, భార్యను హత్య చేసిన కేసులో సంచలన తీర్పు వెలువరించిన బాంబే హైకోర్టు తాజాగా మరో సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ బాలుడిపై లైంగిక దాడి జరిగిందని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ వ్యక్తిపై మైనర్ తండ్రి చేసిన ఆరోపణలను హైకోర్టు కొట్టిపారేసింది. పద్నాలుగేళ్ల బాలుడి పెదవులపై ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం లైంగిక నేరాలు కావని బాంబే హైకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాలు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 పరిధిలోకి రావని వ్యాఖ్యానించింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు.
అసలు వివాదం ఏంటంటే..
తన 14 ఏళ్ల కుమారుడిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడని ముంబైకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో సొమ్ము సైతం పోవడంతో, గుర్తించిన తండ్రి బాలుడ్ని ప్రశ్నించాడు. నగదు తానే తీశానని, ఓ వ్యక్తికి ఆ డబ్బు ఇచ్చానని బాలుడు అంగీకరించాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి కుమారుడు చెప్పిన మాటలు విని షాకయ్యాడు. మైనర్ బాలుడు ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాడు. ఓ రోజు రీఛార్జ్ చేయించుకునేందకు వెళ్లగా నిందితుడు తన పెదాలపై ముద్దు పెట్టుకున్నాడని, కౌగిలించుకున్నాడని తెలిపాడు.
పోలీసులను ఆశ్రయించిన బాలుడి తండ్రి
తన మైనర్ కుమారుడిపై ఓ వ్యక్తి లైంగిక చర్యలకు పాల్పడుతున్నాడని గత ఏడాది ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. తన కొడుకు పెదాలపై ముద్దు పెట్టుకున్నాడని, కౌగిలించుకుని ప్రైవేట్ పార్ట్స్‌ను తాకడని.. పోస్కో చట్టంతోపాటు వికృత లైంగిక చర్యలకు పాల్పడ్డాడని సెక్షన్ 377 కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. దోషిగా తేలితే నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసును విచారించిన జస్టిస్ ప్రభుదేశాయ్ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్ ప్రకారం బాలుడి పెదాలపై ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకుని అసభ్యంగా తాకడం అసహజ లైంగిక నేరాలు కావని స్పష్టం చేశారు.
నిందితుడు ఇప్పటికే ఏడాది పాటు పోలీసుల కస్టడీలో ఉన్నాడని, ఈ కేసు విచారణ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం లేదని బాంబే హైకోర్టు పేర్కొంది. కనుక పూర్తి వివరాలు తెలుసుకుని విచారణ చేపట్టడానికి సమయం పడుతుందని భావించి రూ.30 వేలు వ్యక్తిగత పూచీకత్తులో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Also Read: Woman alimony to husband : విడాకులు ఇచ్చేస్తే ఏమైపోవాలి ? కోర్టుకెళ్లి భరణం తెచ్చుకున్న భర్త !