Manik Saha is Tripura's new chief minister: త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా నియమితులయ్యారు. మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తన పదవికి రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ కేంద్ర అధిష్టానం కొత్త సీఎంను ఎంపిక చేసింది. నేటి సాయంత్రం బిప్లవ్ దేవ్ సీఎం పదవికి రాజీనామా చేయగా, బీజేపీ లెజిస్లేచర్ పార్టీ మాణిక్ సాహాను కొత్త సీఎంగా ఎన్నుకుంది. బీజేపీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మాణిక్ సాహాకు అధిష్టానం ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇచ్చింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.  






కొత్త సీఎం మాణిక్ సాహాకు తాజా మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ అభినందలు తెలిపారు. పుష్పగుచ్ఛాన్ని అందించి విషెస్ తెలిపారు. మాణిక్ సాహా మార్గదర్శకత్వంలో పార్టీ ఏకతాటిపై నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు నేటి సాయంత్రం జరిగిన లెజిస్లేచరీ పార్టీ మీటింగ్‌లో బీజేపీ శాసనసభాపక్ష నేతగా మాణిక్ సాహాను పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కొత్త సీఎం ఎవరో తేల్చడానికి.. కేంద్ర మంత్రి భూపిందర్ యాద్, సీనియర్ నేత వినోద్ తాడ్వేలను పరిశీలకులుగా బీజేపీ అధిష్టానం త్రిపురకు పంపింది. వీరి సమక్షంలో జరిగిన సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు త్రిపుర కొత్త సీఎంగా మాణిక్ సాహా వైపు మొగ్గు చూపారు. 






ఎవరీ మాణిక్ సాహా..
మాణిక్ సాహా వృత్తిపరంగా ఓ దంత వైద్యుడు (Dental Surgeon). కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయనను బీజేపీ అధిష్టానం ఈ ఏడాది మొదట్లో త్రిపుర నుంచి రాజ్యసభకు పంపించింది. త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా 2020లో ఎన్నికయ్యారు. 2016లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు మాణిక్ సాహా. ఆయన ప్రొఫెసర్, త్రిపుర మెడికల్ కాలేజీ, బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ టీచింగ్ హాస్పిటల్‌కు హెడ్‌గా వ్యవహరించారు. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ సేవలు అందించారు.


ఢిల్లీ టూర్ ఎఫెక్ట్.. బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా
త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తాజాగా ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలతో భేటీ అయ్యారు. నేడు ఢిల్లీ నుంచి రాజధాని అగర్తలాకు తిరిగొచ్చిన బీజేపీ నేత బిప్లవ్ దేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర అధిష్టానం సూచన మేరకు సీఎం పదవికి బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తూనే, రాజ్ భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ కేంద్ర అధిష్టానం కీలక మార్పు కోరుకోవడంతో సీఎం పదవి నుంచి బిప్లవ్ దేవ్ తప్పుకున్నారు.


Also Read: Tripura CM Resignation: త్రిపుర రాజకీయాల్లో కీలక పరిణామం, సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా - నేటి రాత్రి కీలక భేటీ


Also Read: Char Dham Yatra Pilgrims Death: చార్​ధామ్ యాత్రలో విషాదాలు, ఇప్పటివరకు 31 మంది భక్తులు మృతి - కారణం ఏంటంటే !