Char Dham Yatra Pilgrims Death: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్‌ధామ్ యాత్రగా వ్యవహరిస్తారు. సంవత్సరంలో ఆరు నెలలు మంచుతో మూసుకుపోయే ఈ ఆలయాల చార్‌ధామ్ యాత్ర ఇటీవల ప్రారంభమైంది. మే 3వ తేదీన చార్‌ధామ్ యాత్ర మొదలుకాగా, ఇప్పటికే 31 మంది భక్తులు మరణించారు. మే 13 వరకు ఈ మరణాలు సంభవించాయని ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
భక్తుల మరణానికి కారణాలివే..
చార్‌ధామ్ యాత్రలో పాల్గొన్న సందర్భంగా అనారోగ్యానికి గురై భక్తులు చనిపోతున్నారని ఉత్తరాఖండ్ ఆరోగ్య డైరెక్టర్ జనరల్ డా.శైలజా భట్ తెలిపారు. గుండెపోటు, కొండలు ఎక్కే క్రమంలో అలసట చెందడం, అధిక రక్తపోటు లాంటి కారణాలతో ఈ 31 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. చార్‌ధామ్ యాత్రలో పాల్గొన్న భక్తులకు ఆయా మార్గాల్లో వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
చార్‌ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులు వైద్య పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ వివరాలను వెబ్‌సైట్లో పొందుపరచాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైద్య పరీక్షల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే, ఆ భక్తులకు ఎంత విశ్రాంతి కావాలో సూచిస్తారు. వైద్యుల సూచన మేరకు అలాంటి భక్తులు తిరిగి తమ చార్‌ధామ్ యాత్ర ప్రారంభించాల్సి ఉంటుందని శైలజా భట్ వెల్లడించారు.
వైద్య పరీక్షా కేంద్రాలు..
రిషికేశ్ ISBT రిజిస్ట్రేషన్ సైట్‌లో చార్‌ధామ్ యాత్రికుల ఆరోగ్య పరీక్షలు ప్రారంభం అవుతాయి. యమునోత్రి మరియు గంగోత్రి యాత్ర మార్గంలో దోబాటా, హీనాల వద్ద, బద్రీనాథ్ ధామ్ యాత్రికుల కోసం పాండుకేశ్వర్ వద్ద ఆరోగ్య పరీక్షా శిబిరాలు ఏర్పాటు చేశామని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శైలజా భట్ పేర్కొన్నారు.
మే 3న చార్‌ధామ్ యాత్ర ప్రారంభం..
అక్షయ తృతీయ సందర్భంగా మే 3న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరవడంతో ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. మే 6న కేదార్‌నాథ్, 8న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకున్నాయి. వేసవి నుంచి ఆరు నెలలు మాత్రమే భక్తులు సందర్శించుకునేందుకు వీలుంటుంది. గత ఏడాది చార్‌ధామ్ యాత్రలో మూడు లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు.
Also Read: Kedarnath Shrine Opens: హరహర మహాదేవ శంభో శంకర- తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం
Also Read: Delhi Mundka Fire: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 27కి చేరిన మృతులు, ప్రధాని మోదీ నష్ట పరిహారం ప్రకటన