దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 27 మందికి చేరింది. వీరంతా మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. ఇంకా పదుల సంఖ్యలో జనం గాయాలపాలు అయ్యారు. ఈ ఘటనలో పోలీసులు తక్షణం స్పందించి 100 మంది వరకూ రోప్ సాయంతో రక్షించారు. పశ్చిమ ఢిల్లీ ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో 24కి పైగా అగ్నిమాపక యంత్రాలు వెంటనే మంటలను అదుపుచేసేందుకు రంగంలోకి దిగి ప్రయత్నించాయి. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మొత్తం 20 మృతదేహాలను వెలికితీసినట్లు డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌదరి మీడియాకు తెలిపారు. కొంతమంది భవనం పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
మంటలు చెలరేగిన భవనం 4 అంతస్తులది. దీనిని వాణిజ్యపరంగా కంపెనీలకు కమర్షియల్ స్పేస్‌ని అందించడానికి ఉపయోగిస్తారు. కంపెనీ యజమానులు వరుణ్ గోయల్, హరీష్ గోయల్‌లను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 8 గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. మంటల్లో జనజీవనం ధ్వంసమైంది. సుమారు 8 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎన్‌ఓసీ లేకుండానే ఈ భవనంలో కంపెనీలు నడుస్తుండటం, పాలకవర్గం కళ్లు మూసుకుని కూర్చోవడం ఆశ్చర్యకరం. ప్రతిసారీ లాగానే ఈసారి కూడా ప్రమాదం జరిగిన తర్వాత భవనానికి ఎన్‌ఓసీ లేదని ప్రభుత్వానికి తెలిసింది.
నష్ట పరిహారం ప్రకటించిన మోదీ
ఈ ప్రమాద దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిహారం ప్రకటించారు. భవనంలో చిక్కుకున్న మరికొందరిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భవనంలోని మెుదటి అంతస్థులో ఉన్న సీసీటీవీ కెమెరాల కార్యాలయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ఆ దుకాణం యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.