Delhi Fire Accident :  దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దిల్లీలోని వాణిజ్య భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో దాదాపు 20 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో 60-70 మందిని పోలీసులు రోప్ సాయంతో రక్షించారు. పశ్చిమ దిల్లీ ముండ్కా మెట్రో స్టేషన్‌ సమీపంలోని మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో 20కి పైగా అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించాయి. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మొత్తం 20 మృతదేహాలను వెలికితీసినట్లు డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌదరి మీడియాకుతెలిపారు. కొంతమంది భవనం పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు. 30 మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 










దిల్లీ అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 






దిల్లీ అగ్ని ప్రమాదంపై సీఎం కేజ్రీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఈ విషాద ఘటన గురించి తెలిసి చాలా బాధ కలిగింది. అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నాను. ధైర్యవంతులైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు, ప్రజలకు కాపాడేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు." అని సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.