Biplab Kumar Deb Resignation: త్రిపుర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ కు శనివారం సాయంత్రం అందజేశారు. నేటి సాయంత్రం లెజిస్లేచర్ పార్టీ కీలక సమావేశం కానుంది. అయితే బిప్లవ్ దేవ్ రాజీనామా (Tripura CM Resignation)కు కారణాలు వెల్లడించలేదు.
ఢిల్లీ టూర్ ఎఫెక్ట్..
త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తాజాగా ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలతో భేటీ అయ్యారు. నేడు ఢిల్లీ నుంచి రాజధాని అగర్తలాకు తిరిగొచ్చిన బీజేపీ నేత బిప్లవ్ దేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర అధిష్టానం సూచన మేరకు సీఎం పదవికి బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తూనే, రాజ్ భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ కేంద్ర అధిష్టానం కీలక మార్పు కోరుకోవడంతో సీఎం పదవి నుంచి బిప్లవ్ దేవ్ తప్పుకున్నారు.
సీఎం నిర్ణయంతో షాకయ్యాం..
‘బిప్లవ్ కుమార్ దేవ్ సీఎం పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయంతో మేం షాకయ్యాం. ఢిల్లీలో ఏం జరిగిందో మాకు తెలియదు. పార్టీ కేంద్ర అధిష్టానంతో చర్చలు జరిపిన తరువాత, బిప్లవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి, పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ఉంటాయని నమ్ముతున్నామని’ త్రిపుర కేబినెట్‌లోని ఓ మంత్రి సీఎం రాజీనామాపై ఇలా స్పందించారు.
నేడు కీలక భేటీ..
పార్టీ నేతల సమాచారం ప్రకారం నేటి రాత్రి బీజేపీ లెజిస్లేచరీ పార్టీ భేటీ కానుంది. నెక్ట్స్ సీఎం ఎవరు అనే దానిపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త సీఎం ఎవరో తేల్చడానికి.. కేంద్ర మంత్రి భూపిందర్ యాద్, సీనియర్ నేత వినోద్ తాడ్వేలను పరిశీలకులుగా బీజేపీ అధిష్టానం త్రిపురకు పంపింది.
Also Read: Delhi Mundka Fire: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 27కి చేరిన మృతులు, ప్రధాని మోదీ నష్ట పరిహారం ప్రకటన