Tension Due To Farmers Protest In Delhi Border: పంటలకు కనీస మద్దతు ధరపై (Minimum Support Price) చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంట్ వరకూ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టేందుకు అన్నదాతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ భారీ మార్చ్ ను అన్నదాతలు మంగళవారం ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు పంజాబ్ (Punjab)లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ బయలుదేరారు. అటు సంగ్రూర్ నుంచి మరో బృందం కూడా ఇంద్రప్రస్థ దిశగా కదిలింది.


రైతులపై భాష్పవాయువు ప్రయోగం






ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడిక్కడ పటిష్ట చర్యలు చేపట్టారు. పంజాబ్, హరియాణా మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్దకు అధిక సంఖ్యలో వచ్చిన అన్నదాతలను నిలువరించేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఢిల్లీ దిశగా కదులుతున్న వారిని అడ్డుకునేందుకు తీవ్ర చర్యలు చేపట్టారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. బాష్పవాయువు ప్రయోగంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయాయి. అలాగే, పోలీస్ బలగాలు డ్రోన్లతో స్మోక్ బాంబ్స్ జారవిడిచారు. ఈ సందర్భంగా వచ్చిన శబ్ధానికి నిరసనకారులు, మీడియా ప్రతినిధులు పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆందోళనకారులు వారి ప్రణాళిక ప్రకారమే 'ఢిల్లీ ఛలో' మార్చ్ ప్రారంభించారని.. రెచ్చగొట్టే ఎలాంటి చర్యలు చేయకపోయినా పోలీసులు ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






ఢిల్లీ సరిహద్దుల్లో అలర్ట్










రైతులు ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారి నిరసనలు భగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఢిల్లీ నగర సరిహద్దుల్లో భారీగా బలగాలు మోహరించారు. రహదారులపై భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలుచోట్ల కాంగ్రెస్ బ్లాక్స్, ఇనుప కంచెలు, మేకులను అడ్డుగా పెట్టారు. ఢిల్లీ అంతటా నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. ముందు జాగ్రత్తగా పార్లమెంట్ సమీపంలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ ను మూసివేశారు. సరిహద్దుల్లో భద్రతా చర్యల నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. గాజీపూర్, జిల్లా సరిహద్దుల్లోని జాతీయ రహదారులపై కి.మీల మేర వాహనాలు బారులు తీరాయి. కిలో మీటర్ దూరం దాటేందుకు గంటకు పైగా సమయం పడుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది.


తప్పనిసరి పరిస్థితుల్లోనే..


మరోవైపు, తప్పనిసరి పరిస్థితుల్లోనే నిరసన ర్యాలీ చేపట్టినట్లు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ శర్వణ్ సింగ్ పంధేర్ అన్నారు. 'మేము బారికేడ్లను బద్దలుకొట్టాలనుకోవడం లేదు. చర్చలతోనే మా సమస్యలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నాం. కానీ, కేంద్రం మాకు ఏ విధంగానూ సాయం చేయట్లేదు. రోడ్లను బ్లాక్ చేస్తామని మేము చెప్పలేదు. ప్రభుత్వమే అలా చేస్తోంది. పంజాబ్, హరియాణా సరిహద్దులు అంతర్జాతీయ సరిహద్దుల్లా కనిపిస్తున్నాయి.' అని అన్నారు. కాగా, ఆందోళనలపై కేంద్రం, రైతుల మధ్య సోమవారం అర్ధరాత్రి వరకూ జరిగిన చర్చలు విఫలమయ్యాయి. MSPకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని రైతు నాయకులు చేసిన డిమాండ్ పై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రైతులు ఆందోళనకే మొగ్గు చూపారు.


Also Read: Teacher Recruitment: ఆ తరగతుల భోధనకు 'టెట్' తప్పనిసరి, కొత్త నిబంధనలు ప్రతిపాదించిన ఎన్‌సీటీఈ