Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేయడంపై దృష్టి సారించాయి. కాంగ్రెస్ పార్టీ కూడా తమకున్న సంఖ్యా బలాన్ని బట్టి కీలక అభ్యర్థులను రాజ్యసభకు ఎంపిక చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా వ్యవహరిస్తున్న సోనియాగాంధీని రాజ్యసభకు పంపించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాదాపుగా సోనియా రాజ్యసభకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆమెను పెద్దల సభకు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీ కాలం ఏప్రిల్ నెలాఖరులో ముగియనుంది. ఖాళీ అవుతున్న ఈ స్థానాన్ని సోనియా కేటాయించేందుకు పార్టీ సిద్ధమైనట్టు చెబుతున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ కాలం ముగియబోతోంది. ఈ స్థానాన్ని కూడా సోనియా కోసం కేటాయించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోనియా గాంధీ కోరిక మేరకు ఈ రెండు స్థానాల్లో ఒక చోట నుంచి ఆమె ఎంపికయ్యే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. 2019లోనే తాను పోటీ చేస్తున్న చివరి ఎన్నికలు అంటూ ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆమె రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. సోనియా గాంధీ ప్రస్తుతం ప్రాతినిద్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ నుంచి అజయ్ మాకెన్
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న బలాన్ని బట్టి రెండు స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ఒక స్థానం నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న మాజీ కేంద్ర మంత్రి అజయ్ మాకెన్‌ను ఎంపిక చేయాలని పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించారు. ఈ నెల 15న పార్టీ సమావేశం కోసం అజయ్ మాకెన్ హైదరాబాద్ వస్తున్నారు. అధిష్టానం ఆయనను తెలంగాణ నుంచి అభ్యర్థిగా ఎంపిక చేస్తే అదే రోజు నామినేషన్లు వేసే అవకాశముందని చెబుతున్నారు. చివరి క్షణంలో మార్పులు లేకపోతే దాదాపు మాకెన్ అభ్యర్థిత్వం ఖాయంగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ నుంచి ఏఐసీసీ సోషల్ మీడియా చైర్మన్ సుప్రియా శ్రీనేత్‌కు అవకాశం కల్పిస్తారనే చర్చ మర వైపు సాగుతోంది. రెండో స్థానాన్ని ఈమెకు కేటాయిస్తారా..? లేక మాకెన్‌కు కాకుండా ఈమకు అవకాశం కల్పిస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది. రాష్ట్ర కోటాలో అభ్యర్థిత్వం కోసం పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, మాజీ ఉపాధ్యక్షుడు నాగయ్య, మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డి, మాజీ ఎంపీ రేణుకా చౌదరి తదితరులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
అభ్యర్థులను ఖరారు చేయని కాంగ్రెస్
రాజ్యసభ స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఈ నెల 15తో గడువు ముగియనుంది. మొత్తంగా 56 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అయితే, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానానికి కూడా అభ్యర్థులను ఖరారు చేయలేదు. రెండు రోజుల్లోనే అభ్యర్థులను ఖరారు చేయడం, నామినేషన్లు దాఖలు చేయడం వంటి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కాస్త నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఇదే ఇప్పుడు పార్టీ అభ్యర్థులను కాస్త ఇరకాటానికి గురి చేస్తోంది. అభ్యర్థులను ఖరారు చేస్తే ఎన్నికపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అభ్యర్థులను ఖరారు చేయడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఆశావహ అభ్యర్థులు అధికంగా ఉండడంతో అగ్రనాయకత్వం కీలక నాయకులతో మంతనాలు జరుపుతోంది.