Ratan Tata Death News | ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ముంబైలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల కిందట ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రతన్ టాటాకు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో రతన్ టాటా కన్నుమూశారు. టాటా గ్రూపు దిగ్గజ చైర్మన్ రతన్ టాటా ఇకలేరని టాటా గ్రూపు ఓ ప్రకటనలో తెలిపింది. రతన్ టాటా మరణంపై ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. టాటాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
టాటా సన్స్ చైర్మన్ భావోద్వేగ లేఖ
రతన్ టాటా కన్నుమూతపై టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పందించారు. ‘రతన్ నావల్ టాటాకు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నాము. టాటాలకు మాత్రమే మరెందరికో సహకారం అందించిన అసాధారణ వ్యక్తి. మన దేశం గర్వించదగ్గ అతికొద్ది మందిలో రతన్ టాటా ఒకరు. మా టాటా గ్రూప్‌కి, టాటా చైర్‌పర్సన్ కంటే ఆయనే ఎక్కువ. ఆయన నాకు కేవలం గురువు మాత్రమే కాదు. ఓ మార్గదర్శకుడు, మంచి స్నేహితుడు. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను.
తిరుగులేని నిబద్ధత, అంకిత భావం కారణంగా ఆయన సారథ్యంలో టాటా గ్రూప్ ఈ స్థాయికి విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయన తనదైన ముద్రవేశారు. ఆయన సూచించిన మార్గంలో నేను నడుస్తాను. ఎన్నో లక్షల మందికి జీవితం ఇచ్చారు. చదువు నుంచి ఆరోగ్యం వరకు ఆయన చేసిన కార్యక్రమాలు అలాగే నిలిచిపోతాయి. రాబోయే తరాలు సైతం రతన్ టాటాన స్మరించుకుంటాయి. టాటా కుటుంబం తరపున, రతన్ టాటా సన్నిహితులు, ఇష్టమైన వారికి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తానని’ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఓ భావోద్వేగ లేఖను విడుదల చేశారు.
3 దశాబ్దాల పాటు మచ్చలేని చైర్మన్‌గా రతన్ టాటా
నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు 1937 డిసెంబర్ 28న రతన్ టాటా జన్మించారు. 1991లో టాటా గ్రూపు ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా సంస్థను ఎన్నో రెట్లు అభివృద్ధి చేశారు. రెండు దశాబ్దాల అనంతరం 2012లో టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి రతన్ టాటా తప్పుకున్నారు. 1996లో టెలికమ్యూనికేషన్స్ కోసం టాటా టెలిసర్వీసెస్‌ని స్థాపించగా, 2004లో ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)గా రూపాంతరం చెంది. 2016 అక్టోబర్ నుంచి ఆరు నెలల పాటు టాటా గ్రూప్ నకు తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరించారు. దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ను 2000లో అందుకున్నారు. భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ 2008లో ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. మహారాష్ట్ర, అస్సాం ప్రభుత్వాల నుంచి పురస్కారాలు అందుకున్నారు.