Ratan Tata Demise | ముంబై: టాటా గ్రూపు మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ముంబైలో కన్నుమూశారు. కొంతకాలం నుంచి వయసురీత్యా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రతన్ టాటా బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణంపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాటాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి రతన్ టాటా అని ఆయన సేవల్ని దేశ వ్యాప్తంగా గుర్తు చేసుకుంటున్నారు. 


ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారన్న వార్త తెలియగానే ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రతన్ టాటా ఎంతో దూరదృష్టి గల వ్యాపారవేత్త.  అసాధారణమైన వ్యక్తి. దేశంలోని ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించిన ఘనత రతన్ టాటాది. ఎంతో వినయంగా ఉంటూనే మెరుగైన సమాజం కోసం తాపత్రయపడేవారు. సమాజానికి చాలా తిరిగివ్వాలని భావించే అతికొద్ది మందిలో టాటా గ్రూపు దిగ్గజ ఛైర్మన్ ఒకరు. విద్య, వైద్య రంగంలో ఆయన విశేష సేవలు అందించారు. నేను సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ లో రతన్ టాటాను తరచుగా కలిసేవాడ్ని. ప్రధాని అయ్యాక సైతం మా మధ్య బంధం, స్నేహం అలాగే కొనసాగింది. కానీ నేడు రతన్ టాటా మన మధ్య లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను’ అని ప్రధాని మోదీ వరుస ట్వీట్లు చేశారు.






రతన్ టాటా కన్నుమూతపై రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ‘రతన్ టాటా మృతి నన్ను కలిచివేసింది. భారత పరిశ్రమలకు ఆయన కింగ్. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన చేసిన సేవల్ని మరిచిపోలేం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. రతన్ టాటా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానంటూ’ రాజ్ నాథ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.






రతన్ టాటా లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థను నడిపించిన వ్యక్తి రతన్ టాటా. ఆయన మనకు అందించిన స్ఫూర్తి, మార్గనిర్దేశంలో నడుద్దాం. లెజెండ్స్ కు మరణం లేదని పోస్ట్ చేశారు.







టాటాలతో పాటు ప్రపంచానికి తీరని లోటు: రాష్ట్రపతి ముర్ము
వ్యాపార దిగ్గజం రతన్ టాటా మరణంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ‘పద్మభూషణ్, పద్మవిభూషణ్ అందుకున్న రతన్ టాటా దేశ ఆర్థిక వ్యవస్థలలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఎంతో మంది విద్యార్థులకు, వ్యాపారులు, ఇతర రంగాల వారికి రతన్ టాటా స్ఫూర్తిగా నిలిచారు. దేశానికి ఆయన అసాధారణ సేవలు అందించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. రతన్ టాటా మరణం కేవలం టాటా గ్రూపు, ఆయన కుటుంబానికి మాత్రమే కాదు ప్రపంచానికి తీరని లోటు’ అని రాష్ట్రపతి ముర్ము ఎక్స్ లో పోస్ట్ చేశారు.