Tajinder Bagga Arrest: 


భాజపా నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు దిల్లీలో అరెస్ట్ చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది. భాజపా, ఆమ్‌ఆద్మీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు దిల్లీలో బగ్గాను పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాదాపు 50 మంది పోలీసులు దిల్లీలోని బగ్గా ఇంట్లోకి చొరబడి ఆయన్ను అరెస్ట్ చేసినట్లు భాజపా ఆరోపించింది. తలపాగా ధరించే సమయం కూడా ఇవ్వలేదని పేర్కొంది.


అంతా అయోమయం


మరోవైపు తన కుమారుడ్ని కొట్టి ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చారని బగ్గా తండ్రి ప్రీత్ పాల్ ఆరోపించారు. వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తే తన ఫోన్, కుమారుడి ఫోన్ లాక్కున్నారని ఆయన అన్నారు. దీంతో తన కుమారుడ్ని కిడ్నాప్ చేసినట్లు ఆయన కేసు పెట్టారు. దీంతో పంజాబ్ పోలీసులపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.


బగ్గా అరెస్ట్‌పై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని దిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అయితే పంజాబ్ పోలీసులు మాత్రం ఈ ఆరోపణను తోసిపుచ్చారు. ముందస్తు సమాచారం ఇచ్చామని.. దీనికి అనుగుణంగానే తమ బృందం ఒకటి గురువారం సాయంత్రం నుంచి జనక్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఉందని వెల్లడించారు. 


మధ్యలో హరియాణా


దిల్లీలో అదుపులోకి తీసుకున్న బగ్గాను మొహాలి తీసుకు వెళ్తుండగా హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత అతడిని దిల్లీ పోలీసులకు అప్పగించారు. తజిందర్ సింగ్‌ తండ్రి కిడ్నాప్‌ కేసు పెట్టడంతో ఇలా చేసినట్లు హరియాణా పోలీసులు తెలిపారు. దీంతో హరియాణా నుంచి తజిందర్ సింగ్‌ను దిల్లీకి తీసుకొచ్చారు. బగ్గాను కిడ్నాప్‌ చేయలేదని, తమ రాష్ట్రంలో నమోదైన కేసు ఆధారంగా అతడిని అరెస్ట్‌ చేశామని హరియాణా పోలీసు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా వివరించినా వినిపించుకోలేదని పంజాబ్‌ పోలీసులు వాపోయారు.


ఇదే కేసు


తజిందర్ సింగ్‌పై మొహాలి జిల్లాలో కేసు నమోదైంది. విద్వేష ప్రకటనలు చేయడం, నేరపూరిత బెదిరింపుల ఆరోపణల కింద అతనిపై కేసు నమోదు చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్‌లో బగ్గా విమర్శలు చేశారు.


ఈ కేసులో విచారించేందుకు పలుమార్లు నోటిసులు పంపినా బగ్గా సహకరించకపోయే సరికి అరెస్ట్ చేయడానికి పంజాబ్ పోలీసులు వచ్చినట్లు పంజాబ్ ఆమ్‌ఆద్మీ నేతలు పేర్కొన్నారు. 


Also Read: Hanuman Chalisa row: వెక్కి వెక్కి ఏడ్చిన నవనీత్ రాణా- ఓదార్చిన భర్త, వీడియో వైరల్!


Also Read: Indian IT Firm: పెళ్లి చేసుకోరా నాయనా- ఏడాదికి 3 సార్లు హైక్ నీకే వాత్సాయనా!