Zakir Hussain Dies at 73 | శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ తబలా కళాకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న జాకీర్ హుస్సేన్ తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో కొన్ని గంటల కిందట ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ తుదిశ్వాస విడిచారని సమాచారం. తన తబల వాద్యంతో కోట్లాది గుండెల్ని మెలితిప్పిన ఘనుడు ఆయన. జాకీర్ హుస్సేన్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అని చెప్పవచ్చు. జాకీర్ హుస్సేన్ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ, క్రికెట్, ఇతర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
హాస్పిటల్‌లో చేరిన గంటల వ్యవధిలో చేదువార్త
గుండె సంబంధిత అనారోగ్య సమస్యతో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలోని ICUలో చికిత్స పొందుతూ జాకీర్ హుస్సేన్ కన్నుమూశారని ఆయన సన్నిహితుడు, ఫ్లూటిస్ట్ రాకేష్ చౌరాసియా తెలిపారు. గుండెపోటు రావడంతో రెండేళ్ల కిందట ఆయనకు డాక్టర్లు స్టెంట్ వేసినట్లు వెల్లడించారు. 2023లో పద్మవిభూషణ్ తో కేంద్ర ప్రభుత్వం ఆయనను గౌరవించింది. ఇటీవల ఆయన మూడు గ్రామీ అవార్డులు అందుకున్నారు. 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. జాజ్ ఫ్యూజన్‌లో, హిందూస్థానీ క్లాసికల్ మ్యూజిల్‌లో తన నైపుణ్యంతో అద్భుతాలు చేశారు.
ఏడేళ్లకే ఎంట్రీ, 11 ఏళ్లకే జాతీయ ప్రదర్శనలు
దివంగత తబలా ప్లేయర్ ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ కుమారుడు జాకీర్ హుస్సేన్ కేవలం 11 ఏళ్లకే రంగ ప్రవేశం చేశారు. ఇంకా చెప్పాలంటే ఏడేళ్లకే తబలాతో తన కెరీర్ ప్రారంభించారు. పదకొండేళ్లకు జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి ప్రజల్ని మెప్పించారు. కొన్ని దశాబ్దాలుగా తన విలువైన సేవలతో సంగీత ప్రపంచంలో జాకీర్ హుస్సేన్ ముద్ర వేశారు. సుమారు 4 దశాబ్దాల కిందట జాకీర్ హుస్సేన్ తన కుటుంబంతో పాటు శాన్ ఫ్రాన్సిస్కోకు మకాం మార్చారు. అక్కడ సైతం సంగీత కచేరిలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు.
Also Read: Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్ పోస్టు వైరల్
జాకీర్ హుస్సేన్ ఘనతలు..
సుదీర్ఘ కెరీర్‌లో తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం జాకీర్ హుస్సేన్ సేవల్ని గుర్తించి 1988లో పద్మశ్రీతో సత్కరించింది. ఆపై 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్‌తో దేశంలోని ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలతో గౌరవించింది. 1990లో అత్యున్నత పురస్కారమైన సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. 2009లో 51వ గ్రామీ అవార్డ్స్‌లో ఆయన గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును గెలుచుకుంది. ఏడు పర్యాయాలు గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యారు.