Pushpa 2 Actor Allu Arjun posts on X | హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన మహిళా అభిమాని రేవతి కుటుంబాన్ని తాను కలవలేకపోతున్నానని టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ కుటుంబాన్ని నేరుగా కలిసి వారికి అండగా నిలవలేకపోతున్నానని తెలిపారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. స్పృహ కోల్పోయి చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ఆరోగ్యం గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను అని అల్లు అర్జున్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు.


చట్టపరమైన కారణాలతో వారిని కలవలేకపోతున్నాను


ప్రస్తుతం ఈ అంశంపై కేసులు కొనసాగుతున్నాయి. లీగల్ ప్రొసీడింగ్స్ కారణంగా తాను రేవతి కుటుంబాన్ని నేరుగా కలవకూడదని లాయర్లు సూచించారని తెలిపారు. కొన్ని చట్టపరమైన కారణాలతో బాధిత కుటుంబాన్ని నేరుగా కలిసి పరామర్శించలేకపోయాను. కానీ వారికి అవసరమైన మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి బాధ్యత తీసుకున్నట్లు తెలిపారు. శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని, వీలైనంత త్వరగా ఆ కుటుంబాన్ని కలుసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఆదుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అల్లు అర్జున్ ఆ పోస్టులో రాసుకొచ్చారు.






తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు, అల్లు అర్జున్ అరెస్ట్
సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న జరిగిన ఘటనలో మహిళా అభిమాని రేవతి చనిపోయారు ఆమె కుమారుడు శ్రీ తేజ్ సైతం స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో బాలుడికి వైద్య చికిత్స కొనసాగుతోంది. మహిళ మృతిపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ సిబ్బంది, నటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ను ఏ11గా పోలీసులు చేర్చారు.



శుక్రవారం నాడు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ను ప్రవేశపెట్టారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్ కు రెండు వారాలపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఊరట కల్పించింది. ప్రీమియర్ షో సందర్భంగా రక్షణ కోరుతూ బందోబస్తు కావాలని పోలీసులకు లేఖ రాసినట్లు సంధ్య థియేటర్ మేనేజ్ మెంట్ తెలిపింది. కోర్టు ఆర్డర్ ఉత్తర్వులు అందడం ఆలస్యం కావడంతో శనివారం ఉదయం అల్లు అర్జున్ విడుదలయ్యారు. అనంతరం టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.


Also Read: Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా