ఇటీవల 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మంగళవారం నాడు పెగాసస్ నిఘా వ్యవహారంపై మరోసారి కేంద్రం తీరును తప్పుపట్టారు. ఓ ముందుకేసి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడం సరైన చర్య కాదని, దీనికి బాధ్యులు తప్పక శిక్ష అనుభవిస్తారని ధర్మాసనం అభిప్రాయపడింది. 


పెగాసస్ స్పైవేర్‌తో ప్రతిపక్ష నేతలు, లాయర్లు, జడ్జీలు, జర్నలిస్టులపై నిఘా ఉంచారంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను నేడు మరోసారి విచారించిన సుప్రీంకోర్టు.. పెగాసస్ స్పైవేర్ వాడకంపై విచారణకు సహకరించాలని, నిఘా ఉంచారా లేదా అనే ప్రశ్నలు కేంద్రానికి సంధించింది. కేంద్ర ప్రభుత్వం తమ ప్రశ్నలకు, సందేహాలకు 10 రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.


దేశ రక్షణ, భద్రత విషయాలను దృష్టిలో ఉంచుకుని తాము ఏ వివరాలు బహిర్గతం చేయలేమని కేంద్రం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అయితే దేశ రక్షణ అవసరమైన నేపథ్యంలో కొందరి ఫోన్లను ట్యాపింగ్ చేసినా.. అందుకు తగిన అధికారంతో చేశారా అంటూ సుప్రీం ధర్మాసనం పలు ప్రశ్నలను కేంద్రానికి సంధించింది. కోర్టు ప్రశ్నలకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. నిపుణుల టీమ్ ముందు కొన్ని వివరాలు బహిర్గతం చేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే ప్రజల సమక్షంలో అలాంటి కీలక విషయాలు వెల్లడించడం దేశ భద్రతకు ముప్పు అని వ్యాఖ్యానించారు.
Also Read: పెగాసస్‌పై విచారిస్తుండగా సోషల్‌మీడియాలో సమాంతర చర్చలెందుకూ..


నిపుణుల ముందు కేంద్ర ప్రభుత్వం విషయాలను బహిర్గతం చేయడానికి వెనుకాడదు. ఒకవేళ కొన్ని ఉగ్ర సంస్థలు టెక్నాలజీ సాయంతో కొందరు వ్యక్తులతో చర్చలు జరుపుతారని, అయితే తటస్థంగా ఉండే కమిటీ, నిపుణులకు మాత్రమే ఆ వివరాలు అందిస్తామని చెప్పారు. ఆ కమిటీ కేవలం కోర్టుకు మాత్రమే నివేదిక వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. 


తుషార్ మెహతా చెప్పిన దానిపై ధర్మాసనం స్పందిస్తూ.. మీరు సొలిసిటర్ జనరల్, మేం కోర్టు.. మనం జాతీయ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనై కాంప్రమైజ్ అవ్వకూడదు. వివరాలను మేం ఎవరికీ వెల్లడించం. అయితే అధికారులు తమకు అఫిడవిట్ సమర్పించడానికి సమస్య ఏముంటుందని ప్రశ్నించింది. అడ్వకేట్ ఎంఎల్ శర్మ, జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్, కొందరు ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ విచారణలో భాగంగా అడిగిన వివరాలను పది రోజుల్లోగా సమర్పించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
Also Read: Pegasus Snooping Row: గూఢచర్యానికి పాల్పడటం చాలా తీవ్రమైన విషయం: సుప్రీంకోర్టు