ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లను గుర్తించినా... గుర్తించకపోయినా వారితో చర్చలు మాత్రం జరపాలని హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వానికిసూచించారు. దేశ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం తాలిబన్లతో దౌత్యపరమైన మార్గాలను తెరిచి ఉంచాలన్నారు. అసదుద్దీన్ ఓవైసీ తాలిబన్లతో చర్చల విషయాన్ని ఇప్పుడే చెప్పలేదు. 2013లోనే పార్లమెంట్‌లోనే చెప్పారు. అప్పుడు ఆయనపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వానికి ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్‌పై ఎలాంటి విధానం అవలంభిస్తుందో తెలియడం లేదని ఓవైసీ విమర్శించారు. ఆప్ఘనిస్థాన్‌లో ఇండియా మూడు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టిందని... ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. తాలిబన్లతో అమెరికా చర్చలు జరుపుతున్నప్పుడు.. భవిష్యత్ పరిణామాలను అంచనా వేయడంలో మోడీ సర్కార్ విఫలమైందని విమర్శించారు.
తాలిబన్లను ఇప్పటి వరకూ ఏ దేశం గుర్తించలేదు. పాకిస్తాన్, చైనా, రష్యా లాంటి ప్రభుత్వాలు తాలిబన్లకు మద్దతు ఇస్తున్నాయి. కానీ వారిని ఆప్ఘనిస్థాన్ అసలైన పాలకులుగా ఇంకా గుర్తించలేదు. అంతే కాక ప్రపంచంలోని అత్యధిక దేశాలు వారిని ఉగ్రవాదుల కేటగిరిలోనే ఉంచాయి. ఐక్యరాజ్య సమితి కూడా తాలిబన్లకు ఉగ్రవాదులుగానే గుర్తిస్తోంది. భారతదేశం తాలిబన్లను ఎప్పుడూ రాజకీయంగా గుర్తించలేదు. వారిని ఉగ్రవాదులుగానే పరిగణిస్తున్నారు. ఆప్ఘనిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ భద్రతాపరమైన జాగ్రత్తలు అమెరికా తీసుకుంటే.. అభివృద్ధి కోసం భారత్ తన వంతు సాయం చేసింది. పార్లమెంట్ భవనాన్ని నిర్మించి ఇచ్చింది. అలాగే కొన్ని నీటి పారుదల ప్రాజెక్టుల్ని నిర్మించింది. ఆప్ఘన్ ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా భారతీయ వ్యాపారవేత్తలు పెట్టారు. ఇప్పుడు తాలిబన్లు దేశం మొత్తాన్ని ఆక్రమించుకోవడంతో అదంతా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.
తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ను ఎలా పరిపాలించబోతున్నారన్నదానిపైనే ఇప్పుడు.. ప్రపంచదేశాలు వారిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ తాలిబన్లు భారీగా హింసకు పాల్పడినట్లుగా వార్తలు రాలేదు. అదే సమయంలో విదేశీయులు.. ఆస్తులపైనా దాడులకు తెగబడినట్లుగా బయటకు తెలియడం లేదు. కానీ ఆప్ఘనిస్థాన్‌లో మాత్రం భయానక వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో భారత పెట్టుబడులు మళ్లీ తిరిగి వస్తాయన్న ఆశ కూడా లేదు. అక్కడ ఉన్న భారతీయులందరూ దాదాపుగా తిరిగి వచ్చేశారు. ఉన్న వారిని తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. తాలిబన్లు ఆఫ్ఘన్‌లో అధికారంలో ఉంటే.. అది ఇండియాకు కూడా ముప్పేనన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఒవైసీ సలహాలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ప్రపంచ దేశాలన్నీ ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. అక్కడ పరిస్థితులు ఏ మాత్రం బాగోలేవని అంచనా వేస్తున్నాయి. అయితే ఆప్ఘన్ అంతర్గత విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోవాలని అనుకోవడంలేదు. తాలిబన్లు వ్యవహరించే తీరును బట్టి ప్రపంచదేశాలవ్యూహం ఖరారయ్యే అవకాశం ఉంది.