Pegasus Snooping Row: గూఢచర్యానికి పాల్పడటం చాలా తీవ్రమైన విషయం: సుప్రీం

ABP Desam   |  05 Aug 2021 02:19 PM (IST)

పెగాసస్ వ్యవహారంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.

పెగాసస్ పై సుప్రీం విచారణ

గూఢచర్యం ఆరోపణల్లో వాస్తవం ఉంటే, అటువంటి చర్యకు పాల్పడటం చాలా తీవ్రమైన విషయం అనడంలో ఎటువంటి సందేహం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ చెప్పారు. జర్నలిస్ట్ ఎన్ రామ్ సహా మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. 

పెగాసస్ నిఘా వివాదంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఇజ్రాయెల్‌లోని ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసిన ఈ స్పైవేర్‌తో కొందరు రాజకీయ నేతలు, ఉద్యమకారులు, పాత్రికేయులపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టినట్లు పిటిషనర్లు ఆరోపించారు. 

పిటిషనర్లు ఎన్ రామ్ సహా మిగతావారి తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

పెగాసస్ ఓ రోగ్ టెక్నాలజీ. ఇది మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి ప్రవేశిస్తోంది. ఇది మన గణతంత్ర దేశ విలువలు, వ్యక్తిగత గోప్యత, గౌరవ, మర్యాదలపై దాడి.                  - కపిల్ సిబల్, న్యాయవాది

వాదనలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.

గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే, నిస్సందేహంగా ఇది తీవ్రమైన విషయం. గూఢచర్యం, నిఘా జరుగుతున్నట్లు 2019లో ఆరోపణలు వచ్చాయి. మరింత సమాచారం తెలుసుకోవడానికి ఏమైనా కృషి జరుగుతోందో, లేదో నాకు తెలియదు.  -    జస్టిస్ ఎన్వీ రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి

సిబల్ స్పందిస్తూ, ఈ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వ వ్యవస్థలకు మాత్రమే అమ్ముతున్నారని తెలిపారు. ప్రైవేటు సంస్థలు దీనిని సంపాదించడం సాధ్యం కాదని చెప్పారు. పాత్రికేయులు, కోర్టు ఆఫీసర్స్, విద్యావేత్తలు, రాజ్యాంగ అధికారులపై ఈ స్పైవేర్‌తో నిఘా పెడుతున్నారని చెప్పారు. దీనిని ఎవరు కొన్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. దీనికి సంబంధించిన హార్డ్‌వేర్‌ను ఎక్కడ పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేయాలని కోరారు. పెగాసస్ స్పైవేర్ అంశం కేవలం మన దేశానికి పరిమితం కాలేదన్నారు. పెగాసస్ సాప్ట్‌వేర్ ను ఆసంస్థ కేవలం ప్రభుత్వ ఏజెన్సీలకు అమ్మినప్పుడు, ఫోన్ హ్యాకింగ్ అంశం కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఉండదన్నారు. 

వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్లపై తదుపరి విచారణ మంగళవారం చేయనున్నట్లు పేర్కొంది. 

Published at: 05 Aug 2021 01:45 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.