పెగాసస్ పై విచారణ చేపట్టిన సర్వోన్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానాల్లో జరిగే విచారణలపై పిటిషనర్లకు విశ్వాసం ఉండాలని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పెగాసస్‌ ఫోన్ల హ్యాకింగ్ పై దాఖలైన  పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ విచారణ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సామాజిక మాధ్యమాల్లో సమాంతర చర్చలు ఎందుకు చేస్తున్నారని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది.


పెగాసస్‌ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సామాజిక మాధ్యమాలల్లో సమాంతర చర్చలు చేయడం దురదృష్టకరమని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. చర్చలకు కోర్టు వ్యతిరేకం కాదన్న ఆయన... కేసు విచారణ కోర్టులో ఉన్నప్పుడు ఇటువంటి చర్చలు తగదన్నారు. కోర్టుల్లో విచారణలపై పూర్తి విశ్వాసం ఉంచాలన్న ఆయన.. కోర్టుల్లో క్రమశిక్షణతో చర్చలు జరగాలన్నారు. పిటిషనర్లు తమ వాదనలు కోర్టులో వివరించాలన్నారు. వారి వాదనలను అపిడవిట్‌ రూపంలో కోర్టుకు అందించాలని కోరారు. సామాజిక మాధ్యమాలు, ఇతర చర్చలకు పరిధిలో ఉండాలన్నారు. సోషల్ మీడియాలో పిటిషనర్లు చర్చలు పెట్టడం సరికాదని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఘాటుగా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందిస్తూ పిటిషనర్లు....చర్చలు పరిధి దాటకుండా చూస్తామని హామీఇచ్చారు.


దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో గతవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ దాఖలు అనంతరం...పిటిషనర్లలో ఒకరైన సీనియర్‌ జర్నలిస్టు ఎన్‌. రామ్‌పై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయని కోర్టు దృష్టికి వచ్చింది. దీనిపై స్పంధించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది.


విచారణ ఆగస్టు 16కి వాయిదా


పెగాసస్‌ వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా తగిన సమాచారం రావాల్సి ఉందని కోర్టు తెలిపింది. వాదనలకు మరికొంత సమయం కావాలని కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది. 


Also Read: YSR Nethanna Nestham Scheme: నేతన్న నేస్తం మూడో విడత సాయం విడుదల... 80 వేల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.192 కోట్లు జమ


తీవ్ర సంచలనం రేపిన పెగాసస్ వ్యవహారం రాజకీయంగా పెను దుమారాన్నే సృష్టించింది. పార్లమెంట్‌ సమావేశాలు తొలి రోజు నుంచే దీనిపై చర్చకు విపక్షాలు పట్టబట్టాయి. అయినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. చివరకు రాజ్యసభలో ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. దీంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.