ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ చాలా అవసరంగా మారింది. ఇది కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా.. భవిష్యత్ భద్రతకు హామీలా ఉపయోగపడుతుంది. ఎగువ, మధ్య తరగతి కుటుంబాల వారు ఎక్కువగా బీమా చెల్లించేందుకు ఇష్టపడతారు. దిగువ మధ్య తరగతి వారికి ఇది కాస్త కష్టమైన విషయమనే చెప్పవచ్చు.


అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం బీమా పథకాన్ని తీసుకొచ్చింది. పేద కుటుంబాల సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకుని.. కేంద్రం ఈ పథకాన్ని తెచ్చింది. దీని పేరు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). ఈ పథకం కింద నెలకు రూ.1 చొప్పున అంటే ఏడాదికి మొత్తం రూ.12 ప్రీమియం చెల్లించాలి.  


రూ.2 లక్షల వరకు సాయం..


దీనిని యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని కూడా చెప్పవచ్చు. ఈ స్కీమ్‌లో ఉన్నవాళ్లు ఒకవేళ ప్రమాదవశాత్తూ మరణించినా లేదా శాశ్వత వైకల్యం బారిన పడినా వారి కుటుంబాలకు దీని ద్వారా రూ.2 లక్షల వరకు బీమా సాయం లభిస్తుంది. ఒకవేళ పాక్షికంగా అంగ వైకల్యం పాలైతే వారికి ఇన్సురెన్స్ కింద రూ.1 లక్ష వరకు చెల్లిస్తారు. 18 నుంచి 70 ఏళ్లలోపు వయసున్న వారంతా ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. 


ఎలా రిజిస్టర్ అవ్వాలి? 
ఈ పథకంలో రిజిస్టర్ అవ్వడం చాలా సులభం. దీని కోసం మీ సమీపంలోని ఏదైనా బ్యాంకుకు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరవచ్చు. మీకు తెలిసిన బ్యాంకు ఉద్యోగులు, ఇన్సూరెన్స్ ఏజెంట్ల ద్వారా కూడా దీని గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. వారిని సంప్రదించి అయినా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.


బ్యాంకుల సహకారంతో ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థలు కూడా ఈ సేవలను అందిస్తున్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నాక మన బ్యాంకు ఖాతాల నుంచి ప్రీమియం మనీ కింద నెలకు రూ.1 ఆటోమెటిక్‌గా కట్ అవుతుంది. కాబట్టి బ్యాంకు ఖాతాలో కనీసం రూ.12 ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. 


గడువు ఏమైనా ఉందా? 
ఈ PMSBY స్కీమ్ కు ప్రతి సంవత్సరం మే 31కి ముందు కల్లా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.12 బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం ప్రమాదాల్లో జరిగిన సంఘ‌ట‌న‌ల‌కు మాత్ర‌మే వర్తిస్తుంది. స‌హ‌జ మ‌ర‌ణాల‌కు, ఆత్మహత్యలకు వ‌ర్తించ‌దు. 


Also Read: Gold-Silver Price: మరోసారి పతనమైన పసిడి ధరలు.. అదే దారిలో వెండి పయనం..