బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం జరిగింది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ చేతిలో ఒక్క T20 కూడా ఓడని ఆసీస్... ఇప్పుడు ఏకంగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి సిరీస్‌ను అప్పగించింది. దీంతో 1-4తో సిరీస్‌ను కోల్పోయారు. ఢాకా వేదికగా తాజాగా ముగిసిన చివరి టీ20 మ్యాచ్‌లో 123 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా కేవలం 62 పరుగులకే... అది కూడా 13.4 ఓవర్లలోనే కుప్పకూలిది. ఆస్ట్రేలియా T20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. మరోవైపు ఆఖరి టీ20లో 60 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్.. ఐదు టీ20ల సిరీస్‌ని 4-1తో చేజిక్కించుకుంది. ఈ సిరీస్‌లో నాలుగో టీ20లో మాత్రమే 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ఆ జట్టులో నయీమ్ (23: 23 బంతుల్లో 1x4, 1x6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహ్మదుల్లా (19), సౌమ్య సర్కార్ (16) కాసేపు క్రీజులో నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో క్రిస్టియాన్, ఎలిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. టర్నర్, అగర్, జంపా తలో వికెట్ తీశారు. సైఫుద్దీన్ రనౌట్‌గా వెనుదిరిగాడు.
123 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా టీమ్ ఊహించని విధంగా తడబడింది. ఆ జట్టు ఓపెనర్ మాథ్యూవెడ్ (22: 22 బంతుల్లో 2x6) దూకుడుగా ఆడినా.. బెన్ డీమాట్ (17: 16 బంతుల్లో 1x6) మినహా మిగిలిన ఆటగాళ్లు అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా టీ20 చరిత్రలోనే అత్యంత తక్కువ బంతుల్లో (82) ఆ జట్టు ఇన్నింగ్స్ ముగించడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ (4/9) కంగారూల పతనాన్ని శాసించగా.. అతనికి సైఫుద్దీన్ (3/12), అహ్మద్ (2/8), మహ్మదుల్లా (1/9) చక్కటి సహకారం అందించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను షకీబ్ ఆల్ హాసన్ దక్కించుకున్నాడు.