బుల్లితెరపై యాంకర్ ప్రదీప్‌కు ఉన్న స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంటర్టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో ఆయన ఎంతో హుషారుగా కనిపిస్తుంటారు. ఆ చలాకీతనం, పంచ్‌లు, మాట తీరుతోనే ప్రదీప్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మహిళా యాంకర్స్‌లో సుమ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తెలుగు మెయిల్ యాంకర్స్‌లో ప్రదీప్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. యాంకరింగ్ చేస్తూనే సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. తన టాలెంట్‌ను నమ్ముకొని ఈ స్థాయికి ఎదిగిన యాంకర్ ప్రదీప్ ఇతరులకు సాయం చేయడంలోనూ ముందు వరుసలోనే ఉంటున్నారు. కరోనా వేళ విధించిన లాక్ డౌన్ సమయంలోనూ అవసరార్థులకు తన వంతు సాయం చేశారు.


తాజాగా, మంత్రి కేటీఆర్ పిలుపునకు యాంకర్ ప్రదీప్ స్పందించారు. సోమవారం ప్రదీప్ మంత్రి కేటీఆర్‌ను కలిసి ఓ చెక్కు అందించారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఏటా ‘గిఫ్ట్ ఎ స్మైల్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది గిఫ్ట్ ఎ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు మూడు చక్రాల మోటారు వాహనాలను అందించారు. ఇందుకోసం కేటీఆర్ కొన్ని వాహనాలను సమకూర్చగా.. మంత్రులు, టీఆర్ఎస్ నేతలు కూడా ఇందుకు సహకరించారు. తాజాగా ఈ కార్యక్రమంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా భాగమయ్యారు. గిఫ్ట్ ఎ స్మైల్‌లో తాను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.


‘‘కేటీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్యూ కేటీఆర్ గారూ. మీరు అందరికి స్ఫూర్తిమంతమైన వ్యక్తి. గిఫ్ట్ ఎ స్మైల్ అనేది చాలా గొప్పది. ఇందులో నేను కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అని యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీనికి తాను కేటీఆర్‌ను కలిసిన ఫోటోలను కూడా జత చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ పోస్టు పెట్టిన 15 గంటల్లోనే దాదాపు 2 లక్షల వరకూ దీన్ని లైక్ చేశారు.


గత ఆగస్టు 8న హైదరాబాద్‌లో నిర్వహించిన గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ఎర్రబెల్లి దయాకర్‌ రావు 150 స్కూటర్లు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు 100 స్కూటర్లు, వివేకానంద్‌ 50, ఎమ్మెల్సీలు శంబీపూర్‌ రాజు 63, నవీన్‌ 100 చొప్పున స్కూటర్లు అందించారు. తన పుట్టిన రోజు నాడు బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేయడం వంటి అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని కేటీఆర్ టీఆర్ఎస్ నేతలను కోరారు.