Ratan Tata Death News : జంతుప్రేమికులు మనకు చాలా మందే కనిపిస్తుంటారు. కానీ రతన్ టాటా మాత్రం పూర్తిగా వేరు. ఆయన ప్రేమకు అవధులు ఉండవు. రోడ్డు మీద వెళ్లే వీధి కుక్కల్ని చూస్తే ప్రాణం అల్లాడిపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంటారు. అందుకే వాటి సంరక్షణ కోసం తన జీవితాంతం కృషి చేశారు. ప్రమాదాల బారిన పడో లేదా మరేదైనా ఘటనతో అవయవాలు సరిగ్గా లేకుండా ఇబ్బంది కుక్కులను తిరిగి నడిచేలా చేశారు. వాటి సంరక్షణ, పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవటం రతన్ టాటాకు చాలా ఇష్టమైన వ్యాపకం.
వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలున్న రతన్ టాటా సోషల్ మీడియా చూస్తే ఈ విషయం ఇట్లే అర్థమైపోతుంది. ఈ రోజు కుక్కపిల్ల దొరికింది. ఎవరైనా దీన్ని పెంచుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి అని పెడతారు. ఎవరైనా ఆ కుక్కను అడాప్ట్ చేసుకుంటే ధన్యవాదాలు పెడతారు. తన కంపెనీలో పనిచేసే వారెంత చిన్న ఉద్యోగి పర్లేదు ఏదైనా కుక్కల సంరక్షణ కోసం చిన్న కృషి చేసినా పోస్ట్ పెట్టేస్తారు రతన్ టాటా. అంతే కాదు ముంబైలో ఇలా అనాథలుగా మిగిలిపోయిన జంతువులకు వైద్యం అందించేలా స్మాల్ యానిమల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు రతన్ టాటా. టాటా ట్రస్టులకు ఈ జంతువుల వైద్యశాల బాధ్యతలను అప్పగించారు.
వేల కోట్ల అధిపతి అయినా నేల మీదనే కూర్చుంటారు
చిన్న చిన్న ఒత్తిళ్లకే టెన్షన్ పడిపోతుంటాం. మనలా కష్టపడే మనిషి ప్రపంచంలోనే లేడని ఫీలైపోతాం. అలాంటిది వేలకోట్ల సామ్రాజ్యమైన టాటా సంస్థలు నడుపుతూ కూడా రతన్ టాటా కంగారు పడేవారు కాదు. టెన్షన్ అనేది ఆయన మొహంలో ఎప్పుడూ కనిపించదు అంటారు సన్నిహితులు. రతన్ టాటా లైఫ్ స్టైల్ చూసినవాళ్లు ఎవరైనా ఈయన అసలు ఆగర్భ శ్రీమంతుడేనా అని సందేహ పడుతుంటారు. ఎందుకంటే అంత సింపుల్ గా ఉంటుంది ఆయన జీవితం. ముంబైలో విలాసవంతమైన ఏరియాలో కోట్ల ఖర్చు చేసే విల్లాలో ఆయన ఉండొచ్చు కానీ సింపుల్‌గా ఓ చిన్న ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. వృద్ధాప్యం మీదకు వచ్చినా రోజులో ఎక్కువ సేపు నేలమీదనే కూర్చున్నారు. ఆయనకు భేషజాలు ఉండవు. నిగర్వి. మంచి మనసు. టాటా కంపెనీలోనే ల్యాండ్ రోవర్, జాగ్వార్ లాంటి కార్లు తయారు అవుతాయి. కానీ రతన్ టాటా ఇప్పటికీ టాటా సెడాన్ లేదంటే తనకెంతో ఇష్టమైన నానో కారు వేసుకుని ఒక్కరే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండేవాళ్లు. దారిలో ఎవరైనా స్నేహితులు కనిపించినా..చిన్న చిన్న కుక్క పిల్లలు కనిపించినా కారు ఆపి వాటికి బిస్కెట్లు తినిపించటం రతన్ టాటాకు ఎంతో ఇష్టమైన పని. అలాంటి రతన్ టాటా ఇక లేరనే విషయమే యావత్ దేశాన్ని కదిలించి వేస్తోంది.
దేశం చూసిన రెండో కర్ణుడు రతన్ టాటా
30 లిస్టెడ్ కంపెనీలు ఉన్న రతన్ టాటా ఆస్తి ఎంతో తెలుసా కేవలం 3800 కోట్లు. ఉప్పు నుంచి ఉక్కు వరకూ అమ్మే టాటాల వారసుడి ఆస్తి ఇంతేఅంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే ఇదే దేశంలో వ్యాపార దిగ్గజాల ఆస్తులు లక్షల కోట్లలో ఉంటాయి. కానీ రతన్ టాటా ఏడాదికి రెండున్నర కోట్ల మాత్రమే సంపాదిస్తున్నారు. అది కూడా ఆయనకు టాటా సన్స్‌లో ఉన్న షేర్ల కారణంగా వస్తున్నాయి. కానీ మహానుభావుడు రతన్ టాటా తన జీవితంలో దానం చేసిన సొమ్ము ఎంతో తెలుసా...అక్షరాలా 9వేల కోట్ల రూపాయలు. దేశం ఇబ్బందుల్లో ఉందని తెలిస్తే చాలు ముందు కదిలిపోయే గుండె ఆయనదే.
మొన్నటికి మొన్న కొవిడ్ మహమ్మారి దేశం మొత్తాన్ని అతలాకుతలం చేస్తే దేవుడిలా ఆదుకున్నాడు రతన్ టాటా. ఏ వ్యాపారవేత్త ఊహకు అందని రీతిలో 1500కోట్ల రూపాయల భూరి విరాళాన్ని టాటా సన్స్, టాటా గ్రూప్ తరఫున ప్రకటించారు రతన్ టాటా. దేశంలో పాఠశాలలు బాగుపడాలని, విద్యావ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ బాగుపడితే అంత కంటే దేశానికి సేవ మరొకటి లేదని నిత్యం చెప్పేవారు రతన్ టాటా. తన జీవితంలో సంపాదన కోసమే కాకుండా సంపాదించిన ప్రతీ రూపాయి దేశం కోసం ఖర్చు పెట్టాడు కాబట్టే ఆయన మృతికి దేశం మొత్తం కదిలిపోతోంది.
టాటా అంటే అదొక సంస్థ కాదు దేశం మొత్తం అదొక ఎమోషన్ అనేలా వ్యాపార సామ్రాజ్యాన్ని తీర్చిదిద్దిన ఈ అపర కుబేరుడు..తన దాతృత్వంతో పెద్ద మనసుతో మనం దేశం చూసిన రెండో కర్ణుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజల మనసులో చిరంజీవిగా నిలిచిపోయారు.
Also Read: న్యూ ఐడియాల స్టార్టప్‌లకు బూస్టర్- మధ్యతరగతి ప్రజల సేవియర్ రతన్ టాటా