ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు బుధవారం నాడు రాజ్యసభలో కంటతడి పెట్టారు. ఆయన ఆవేదన చెందుతూ గద్గద స్వరంతో మాట్లాడారు. మంగళవారం నాటి సభలో కాంగ్రెస్ ఎంపీలు పలువురు తీవ్రమైన గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో సభలో ఎంపీల ప్రవర్తనపై తాను కలత చెందానని వెంకయ్య ప్రకటించారు. వారు అలా ప్రవర్తించడంపై రాత్రి అసలు తనకు నిద్రపట్టలేదని ఆవేదన చెందారు. మంగళవారం సభలో జరిగిన ఘటనలపై తాను ఎలా ఆగ్రహం వ్యక్తం చేయాలో కూడా తెలియడం లేదని ఆవేదన చెందారు. ‘సభలో ఇలాంటి పరిస్థితులను టీవీల్లో చూపించడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఎందుకు చూపించడం లేదో నాకు తెలియదు. రాజ్యసభ టీవీ వీటన్నింటినీ చూపించాలి’’ అని వెంకయ్య కోరారు.
ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే వెంకయ్య ప్రసంగిస్తూ.. రాజ్యసభలో నిన్న జరిగిన పరిణామాలు, ఎంపీల అనుచిత ప్రవర్తన దురదృష్టకరం. ప్రజాస్వామ్యానికి పార్లమెంటు అనేది ఒక పవిత్ర దేవాలయం. కానీ కొందరు సభ్యులు సభలో అనుచితంగా వ్యవహరించారు. అధికారుల టేబుళ్లపైకి ఎక్కి రభస చేశారు. పోడియం ఎక్కి నిరసన తెలపడం అంటే గర్భ గుడిలోకి ప్రవేశించి గలభా చేయడమే. నిన్నటి పరిణామాలు తలుచుకుంటే నాకు రాత్రి నిద్రపట్టలేదు. సభలో ఇన్ని రోజులు కార్యకలాపాలు స్తంభించడం మంచిది కాదు’’ అంటూ వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన చేతులు కూడా వణికాయి. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు.
Also Read: Huzurabad By-Election: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ప్రకటించిన కేసీఆర్.. ఇంతకీ ఎవరాయన?
రాజ్యసభలో మంగళవారం రైతుల సమస్యను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. దీనిపై చర్చ జరుగుతున్న సందర్భంలో కొందరు కాంగ్రెస్ ఎంపీలు రభస చేశారు. బల్లలు ఎక్కి పేపర్లు, ఫైళ్లు విసిరేస్తూ నిరసన తెలిపారు. కొందరు బల్లలపై గంట సేపటి వరకూ కూర్చొనే ఉన్నారు. ఇంకొందరు వీటి చుట్టూ చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాల చేశారు. దీంతో వెంకయ్య సభను పదే పదే వాయిదా వేశారు.
లోక్‌సభ నిరవధిక వాయిదా
మరోవైపు, లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ కన్నా ముందే లోక్‌సభ సమావేశాలు ముగిశాయి. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇప్పటికే పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకున్న విషయం తెలిసిందే. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 వరకు లోక్‌సభ సమావేశాలు జరగాల్సి ఉంది.