హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈయన తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో అరెస్టులై పలుమార్లు జైలుకెళ్లారు. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్ధతను గుర్తించిన కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.


నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక తరహాలోనే నామినేషన్ల సమయంలోనే అభ్యర్థిని ప్రకటిస్తారని తొలుత అనుకున్నారు. కానీ, హుజూరాబాద్‌లోని పరిస్థితుల వల్ల అభ్యర్థిని షెడ్యూల్‌ కంటే ముందే ప్రకటిస్తే మంచిదని కేసీఆర్‌ భావించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈటలకు దీటుగా టీఆర్ఎస్ అభ్యర్థిని ముఖ్యమంత్రి కేసీఆర్.. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. 


ఆయనే ఎందుకంటే..
మొదటి నుంచి టీఆర్ఎస్ అధిష్ఠానం ఈటలకు దీటైన అభ్యర్థి కోసం వెతికింది. గెల్లు శ్రీనివాస్‌ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి.. ఎన్నికల ప్రచారంలో కూడా ఎలాంటి విమర్శలకు తావులేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ఈటల బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. టీఆర్ఎస్ పార్టీ కూడా తన అభ్యర్థిని బీసీకి చెందిన వ్యక్తినే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.


ఎన్నో ఊహాగానాలు
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో తొలి నుంచి ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు టీఆర్ఎస్‌లో చేరడంతో ఆయనకు టికెట్ వస్తుందని భావించారు. తర్వాత కాంగ్రెస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నుంచి ఇనుగాల పెద్దిరెడ్డి వంటి వారు కూడా చేరడంతో వారిలో ఎవరికైనా హుజూరాబాద్ టికెట్ వస్తుందని భావించారు. కానీ, ఆ ఊహాగానాలకు తెరదించుతూ గెల్లు శ్రీనివాస్ పేరును ఖరారు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఎవరీ గెల్లు శ్రీనివాస్ యాదవ్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలానికి చెందిన గెల్లు శ్రీనివాస్ 2017 నుండి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అంతకుముందు 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయనపై 100కు పైగా కేసులు నమోదు కాగా.. ఎన్నోసార్లు జైలుకు వెళ్లొచ్చారు.


* గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ స్వస్థలం.. హిమ్మత్ నగర్ గ్రామం, వీణవంక మండలం, కరీంనగర్ జిల్లా
* తండ్రి గెల్లు మల్లయ్య మాజీ ఎంపీటీసీ, కొండపాక
* పుట్టిన తేదీ 21-08-1983, విద్యార్హతలు: ఎంఏ, ఎల్‌ఎల్‌బీ
* డిగ్రీ చదువుతున్న కాలం నుంచే రాజకీయాలలోకి..
* అంబర్ పేట్‌లోని ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో ఉంటూ బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాటం
* A.V కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం వైపు ఆకర్షణ
* 2003-2006 కాలంలో విద్యార్థుల ఫీజు పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపి అరెస్టు
* అదే సమయంలో TRSV హైదరాబాద్ పట్టణ కార్యదర్శిగా..
* 2004లో స్కాలర్ షిప్, ఫీజు రియింబర్స్‌మెంటు పెంచాలని ఆర్థిక మంత్రి రోశయ్య ఇంటి ముట్టడి, అరెస్టు
* 2006లో సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో లగడపాటి రాజగోపాల్‌కు వ్యతిరేకంగా జరిపిన ర్యాలీలో అరెస్టు
* 2006లో సిరిసిల్ల, కరీంనగర్ ఉప ఎన్నికలలో హరీష్ రావు నాయకత్వంలో పని చేశారు
* 2009 ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల నాయకత్వంలో పనిచేశారు. 
* 2009లో కేసీఆర్‌ అరెస్టును నిరసిస్తూ ఓయూ విద్యార్థులతో పెద్ద ఎత్తున ఉద్యమం
* 2010లో ‘‘తెలంగాణ విద్యార్థి మహా పాదయాత్ర’’ ప్రారంభం..
* 650 కి.మీ. పాదయాత్ర చేసి వేల మంది విద్యార్థులను ఉద్యమంలో భాగస్వామ్యం చేశారు.
* 2011లో యాదిరెడ్డి ఆత్మహత్యకు నిరసనగా భారీ ర్యాలీ, అరెస్టు..
* 2013లో APNGO's తలపెట్టిన ‘‘సేవ్ ఆంద్రప్రదేశ్’’ మీటింగ్ వ్యతిరేకిస్తూ ఎల్బీ స్టేడియం వద్ద అరెస్టు
* 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర
* గెల్లుపై 100కు పైగా కేసులు.. అనేకసార్లు అరెస్టయ్యారు
* చర్లపల్లి సెంట్రల్ జైల్, చంచల్ గూడలో జైలు జీవితం
* 2017 నుండి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు