Rajasthan Elections:
ఏబీపీ న్యూస్ సోర్సెస్ ద్వారా..
రాజస్థాన్‌లో గహ్లోట్ వర్సెస్ పైలట్ యుద్ధం చాన్నాళ్లుగా నడుస్తోంది. సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేశారు సచిన్ పైలట్. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదన్న అసహనంతో తరచూ గహ్లోట్‌పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ విభేదాలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఖర్గే వచ్చిన తరవాత సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా...ఇద్దరూ వెనక్కి తగ్గడం లేదు. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో పార్టీలో అంతర్గత విభేదాలు కొనసాగితే అధికారం చేజారి పోతుందని భావిస్తోంది హైకమాండ్. అందుకే...దీనికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ABP News సోర్సెస్ ద్వారా ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే సచిన్ పైలట్‌కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు హైకమాండ్ మొగ్గు చూపుతోందని సమాచారం. దీనిపై గహ్లోట్ అలక వహించకుండా...జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. "ప్రతి సారీ మీకే అవకాశం ఇస్తున్నాం. సీఎం పదవి కోసం పోటీ పడుతున్న వాళ్లున్నారు. వాళ్ల గురించి కూడా కాస్త ఆలోచించాలిగా" అని హైకమాండ్ గహ్లోట్‌కి హితోపదేశం చేసినట్టు తెలుస్తోంది. యువ నేతలకు అవకాశమిస్తే పార్టీ బలం పుంజుకుంటుందని భావిస్తోంది అధిష్ఠానం. సచిన్ పైలట్ పార్టీ వీడిపోయి కొత్త పార్టీ పెడితే తమకే నష్టం అని గ్రహించిన కాంగ్రెస్...ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే...పైలట్ సన్నిహితులు మాత్రం "ఆయనకు కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు" అని చెబుతున్నారు. గతంలోనూ కాంగ్రెస్ సీనియర్ నేతలు "ఇవన్నీ పుకార్లు మాత్రమే" అని తేల్చి చెప్పారు.
"సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడతున్నారన్న వార్తలు పుకార్లు మాత్రమే. ఆయన పార్టీని వీడతారనడానికి ఎలాంటి సంకేతాలివ్వలేదు. ఈ మధ్యే ఆయనతో మాట్లాడాను. పార్టీ నుంచి వెళ్లిపోతానని ఏమీ చెప్పలేదు. అదిష్ఠానం ఆదేశాల మేరకు సచిన్ పైలట్‌తో చాలా సార్లు చర్చించాను. కలిసికట్టుగా పని చేసేందుకు గహ్లోట్, పైలట్ ఆసక్తి చూపిస్తున్నారు"
- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ
ఇప్పటికే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఈ ఇద్దరు నేతల వాదనలు విన్నారని తెలుస్తోంది. ఆ తరవాతే వాళ్లిద్దరినీ కాంప్రమైజ్ చేసి ఉంటారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. సచిన్ పైలట్ గెహ్లాట్ కు వ్యతిరేకంగా సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఐదురోజులపాటు పాదయాత్ర చేశారు. తమది కూడా 40శాతం కమీషన్ ప్రభుత్వమేనని రాజస్థాన్‌లో గెహ్లాట్ కూడా 40 శాతం కమీషన్ సర్కార్ నడిపిస్తున్నారని పైలట్ వర్గానికి చెందిన ఓ మంత్రి చేసిన ఆరోపణ సంచలనం అయింది. కమీషన్ అప్పజెప్పనిదే ఫైళ్లు ముందుకు కదలడం లేదని విమర్శించారు. పైలట్ చేపట్టిన పాదయాత్రలో ఆరోపణలు చేసిన మంత్రి సహా 15 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తాము పార్టీ విడిచివెళ్లిపోవాలని గెహ్లాట్ అనుకుంటున్నారని, కానీ పార్టీలోనే కొనసాగుతామని, మీ వెంటే ఉంటామని ఎమ్మెల్యేలు పైలట్‌కు మద్దతు పలికారు. ఇలాంటి కీలక తరుణంలో హైకమాండ్ ఈ విభేదాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది.
Also Read: Manipur Violence: మణిపూర్‌లో జూన్ 15 వరకూ ఇంటర్నెట్ బంద్, కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్