Manipur Violence:
అక్కడక్కడా దాడులు
మణిపూర్‌లో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటన తరవాత పరిస్థితులు అదుపులోకి వస్తాయని భావించినా...అంతకంతకూ హింస పెరుగుతోంది. ఫలితంగా...జూన్ 15వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు. కొన్ని చోట్ల ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెడుతున్నారు. ఇళ్లపై దారుణంగా దాడులు చేస్తున్నారు. ఒకరినొకరు కాల్చుకుంటున్నారు. ఎక్కడ చూసినా భయానక వాతావరణమే కనిపిస్తోంది. అయితే..అధికారులు మాత్రం గత 24 గంటల్లో రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటన జరగలేదని చెబుతున్నారు. రాష్ట్రం సాధారణ స్థితికి వచ్చిందని అంటున్నారు.
"గత 24 గంటల్లో రాష్ట్రంలో ఎక్కడా హింస చెలరేగలేదు. అంతా ప్రశాంతంగానే ఉంది. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉందనడానికి ఇదే ఉదాహరణ. పలు చోట్ల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది"
- సాపం రంజన్, రాష్ట్ర మంత్రి
హిమంత బిశ్వ శర్మ భేటీ..
అటు కేంద్రమంత్రి అమిత్‌షా ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ...మణిపూర్ సీఎం బైరెన్ సింగ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసపై పూర్తి స్థాయిలో ఓ రిపోర్ట్ తయారు చేసి అమిత్‌షాకి పంపుతానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 349 రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ 4,537 ఆయుధాలను దొంగిలించారు ఆందోళకారులు. వీటిలో 990 ఆయుధాలను పోలీసులు రికవర్ చేసుకున్నారు. శాంతిభద్రతలు కాపాడేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పోలీసులతో పాటు భద్రతా బలగాలూ నిఘా పెడుతున్నాయి. జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నాయి.
"మణిపూర్‌లోని పరిస్థితులను గమనించాను. సీఎం బైరెన్ సింగ్‌తో మాట్లాడాను. మణిపూర్‌లో శాంతియుత వాతావరణం నెలకొనేలా చేయడమే మా లక్ష్యం. నేను గమనించిన ప్రతి విషయాన్నీ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకి వివరిస్తాను. అవసరమైన చర్యలు తీసుకునేలా నా వంత ప్రయత్నం చేస్తాను"
- హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం
మే 3వ తేదీ నుంచి మణిపూర్ అట్టుడుకుతోంది. గిరిజన, గిరిజనేతర వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రం పోలీసులు, భద్రతా బలగాల నిఘాలో ఉంది. ఎక్కడా మళ్లీ అల్లర్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు పోలీసులు. అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మణిపూర్ పర్యటనకు వెళ్లి అక్కడి అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించారు. పరిస్థితులు సమీక్షించారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. హైకోర్ట్ రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. గవర్నర్ నేతృత్వంలోనూ మరో కమిటీ ఏర్పాటు కానుంది. ఇదే విషయాన్ని అమిత్‌షా అధికారికంగా వెల్లడించారు.
Also Read: Petrol Diesel Price: త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గబోతున్నాయి: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి