Gold Rate Below 60,000 Rupees: గత కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం, భారతదేశంలో 10 గ్రాముల పసుపు లోహం రేటు రూ. 60 వేల దిగువకు పడిపోయింది. గత కొన్ని నెలలుగా బంగారం ధర స్టెబ్‌ బై స్టెప్‌ ఎక్కుతూ పీక్‌ స్టేజ్‌కు వెళ్లింది. ఈ ఏడాది మే నెలలో, నగలు కొనడానికి వెళ్లినవాళ్లకు పట్టపగలే చుక్కలు చూపించింది. మే 5వ తేదీన, 24 కేరెట్ల స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములకు రూ. 62,400, 22 కేరెట్ల ఆర్నమెంట్‌ బంగారం 10 గ్రాములకు రూ. 57,200 వద్ద గరిష్ట స్థాయికి చేరాయి. 


గరిష్ట స్థాయుల నుంచి ఈ అలంకరణ లోహం 10 గ్రాములకు రూ. 2,500 వరకు తగ్గింది. ఇప్పుడు 60 వేల రూపాయల దగ్గరలో ఉంది. డాలర్ బలపడటం వల్లే బంగారం ధర తగ్గింది.


ఫెడ్‌ మీటింగ్‌ ఎఫెక్ట్‌
ఈ నెల 13, 14 తేదీల్లో యుఎస్ ఫెడ్ సమావేశం జరుగుతుంది. FOMC మీటింగ్‌లో వడ్డీ రేట్లను పెంచరని, పెంపుదలను ఇక నిలిపేస్తారన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. మన దేశంలోనూ, యుఎస్ ఫెడ్ సమావేశం నేపథ్యంలో పసిడి ధర రూ. 60,000 కంటే తక్కువగా ఉందని రిద్దిసిద్ధి బులియన్స్ (RSBL) ఎండీ పృథ్వీరాజ్ కొఠారి తెలిపారు. ఫెడ్‌ సమావేశంలో తీసుకునే నిర్ణయం ప్రభావం బంగారం ధరపై కనిపిస్తుంది. గోల్డ్ బుల్ రన్‌కు 60,000 మార్క్‌ ఒక బేస్‌గా మారిందని నిపుణులు భావిస్తున్నారు.


బంగారం ధర మరింత బలహీనపడుతుందా?
పసుపు లోహానికి డిమాండ్‌ను పెంచే ముఖ్యమైన కారణమేదీ సమీప భవిష్యత్తులో లేదు. సాంప్రదాయకంగా, వేసవి కాలం బంగారానికి బలహీనమైన సీజన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో, రాబోయే US ఫెడ్ సమావేశం ఫలితాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయి, గోల్డ్‌ రేటు ఎలా ఉండాలన్న విషయంలో స్పష్టమైన చిత్రాన్ని అందిస్తాయి.


డాలర్ ఇండెక్స్ 104.50 స్థాయిని నిలబెట్టుకోలేకపోతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో, USలో ద్రవ్యోల్బణం రేటు, US నిరుద్యోగ గణాంకాలు కూడా వడ్డీ రేటును పెంచకుండా ఫెడ్‌కు అడ్డం పడవచ్చు. అదే జరిగితే, బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.


తొలుత తగ్గి, ఆపై పుంజుకోవచ్చని అంచనా
నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం రూ. 58,600 స్థాయి కంటే దిగువకు వెళ్లవచ్చు. ఆ స్థాయిలో మద్దతు కూడగట్టుకుని వేగంగా పైకి ఎదుగుతుంది, రూ. 61,440కి చేరుకుంటుంది. ఆ స్థాయిలో కూడా డిమాండ్‌ తోడయితే, రూ. 62,500, ఆ తర్వాత రూ. 63,650ను తాకవచ్చు.


మరో ఆసక్తికర కథనం: పన్ను ఆదా చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి, త్వరగా సేకరించండి 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.