ఛత్తీస్ గఢ్ జిల్లాలోని కోర్బా జిల్లా సెషన్స్ కోర్టు 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. సందీప్ కుమార్ ఝా తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈయన సొంత స్థలం బిహార్‌లోని దర్భంగా జిల్లా. ఈ అధికారిపై తాజాగా ఆయన భార్య గృహహింస, వరకట్న వేధింపులు, అసహజ శృంగారం చేయమని బలవంతం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయంలో ఛత్తీస్ గఢ్‌లోని కోర్బా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఐఏఎస్ భార్య కోర్టును ఆశ్రయించారు. న్యాయవాది శివనారాయణ్ సోనీ ఈ విషయాన్ని న్యాయమూర్తి ముందు ఉంచారు. ఆ తర్వాత ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2021లో బిహార్‌లోని దర్భంగాకు చెందిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝాతో బాధితురాలికి వివాహం జరిగింది. పెళ్లికి ముందు తర్వాత కూడా అతడు వరకట్నం కోసం నిరంతరం వేధించారు. భర్త సందీప్ ఝా వరకట్న వేధింపులు, తనపై దాడి, అసహజ లైంగిక సంబంధాలపై ఆయన భార్య ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు.
భారీ వరకట్నం డిమాండ్
‘‘వివాహం జరిగినప్పటి నుంచి నగదు, ఆభరణాల విషయంలో నిరంతరం ఒత్తిడి ఏర్పడింది. పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశారు. అయినా ఐఏఎస్ కుటుంబం వరకట్నం డిమాండ్ చేస్తుంది. కనీసం 50 తులాల బంగారు, వెండి ఆభరణాలు, బ్రాండెడ్ బట్టలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, టీవీ, ఫర్నీచర్ వంటి వాటిని ఇచ్చాం’’ అని ఫిర్యాదులో ఆయన భార్య పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కోర్బా సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.