Rahul Gandhi: 



బీజేపీని గాడ్సేతో పోల్చిన రాహుల్..


కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీని గాడ్సేతో పోల్చారు. కాంగ్రెస్‌కి, బీజేపీకి మధ్య ఉన్న తేడాలేంటో చెబుతూ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో జన్ ఆక్రోశ్ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్...రాబోయే ఎన్నికలను రెండు సిద్ధాంతాల మధ్య జరగనున్న యుద్ధంగా అభివర్ణించారు. ఓ వైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ మరోవైపు కాంగ్రెస్ తలపడనున్నాయని అన్నారు. మహాత్మా గాంధీ ఐడియాలజీ కాంగ్రెస్‌ది అయితే...బీజేపీది గాడ్సే ఐడియాలజీ అని మండి పడ్డారు. 


"రాబోయే ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం లాంటిదే. ఓ వైపు మహాత్మా గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించే కాంగ్రెస్ పార్టీ. మరో వైపు గాడ్సే ఐడియాలజీని ఫాలో అయ్యే బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఈ రెండు సిద్ధాంతాల మధ్య పోటీ జరగనుంది. ఇది విద్వేషం, ప్రేమకి మధ్య జరిగే యుద్ధం. బీజేపీ నేతలు ఎక్కడికి వెళ్లినా విద్వేషాలనే ప్రచారం చేస్తారు. మధ్యప్రదేశ్‌లోనూ ఇదే చేశారు. అందుకే ఇక్కడి ప్రజలు బీజేపీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. యువత కూడా ఆగ్రహంతో ఉంది. ప్రజలకు వాళ్లు ఏదైతే చేశారో..అదే ఇప్పుడు వాళ్లకి తిరిగొస్తోంది"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ






జోడో యాత్ర గురించి..


భారత్ జోడో యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్‌లో చాలా మంది రైతులను కలిసినట్టు చెప్పారు రాహుల్ గాంధీ. దాదాపు 370కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో రైతులు, మహిళలు, యువత తనను కలిశారని అన్నారు. 


"మధ్యప్రదేశ్‌లో 370 కిలోమీటర్ల మేర జోడో యాత్ర సాగింది. ఆ సమయంలో రైతులు, యువత, మహిళలు వచ్చి నన్ను కలిశారు. వాళ్ల సమస్యలన్నీ చెప్పుకున్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ చేసినంత అవినీతి మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ కనిపించదు. తమ పంటలకు సరైన ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో బియ్యానికి రూ.2,500 ధర ఇస్తామని హామీ ఇచ్చాం. అది అమలు చేస్తున్నాం"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ






తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. చాలా రోజులుగా కాంగ్రెస్ ఈ డిమాండ్‌ని వినిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్‌ మంచిదే అయినా అంతకు ముందుగానే కుల గణన చేపట్టి వెనక బడిన వర్గాలకు చెందిన మహిళలకు చేయూతనివ్వాలని తేల్చి చెబుతోంది. 


Also Read: బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు