Viral Video: 


ఆడికార్‌లో మార్కెట్‌కి..


కేరళలోని ఓ రైతు ఆడి కార్‌లో మార్కెట్‌కి వచ్చిన వీడియో వైరల్ అవుతోంది. కార్ దిగి సాధారణ రైతులా అక్కడే కూర్చుని కూరగాయలు అమ్మాడు. ఆ తరవాత మళ్లీ ఆడి కార్‌ ఎక్కి వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో ఈ వీడియోకి బోలెడన్ని లైక్‌లు, కామెంట్స్ వస్తున్నాయి. రైతు ఆడి కార్‌లో రావడమేంటని ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో కనిపించిన యువరైతు పేరు సుజిత్ (Sujith SP). వెరైటీ ఫార్మర్‌గా బాగా పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ వ్యక్తే ఇప్పుడు రూ.44 లక్షల విలువ చేసే ఆడి కార్‌లో వచ్చి కూరగాయలు విక్రయించాడు. ఆడిలో వచ్చి పాలకూర అమ్మాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశాడు. కార్‌లో నుంచి కిందకి దిగిన వెంటనే ఓ చాప నేలపై పరిచాడు. పాలకూర కట్టల్ని ఆ చాపపై పెట్టాడు. అమ్మడం పూర్తయ్యాక మళ్లీ కార్‌లో వెళ్లిపోయాడు. కొద్ది రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోకి నాలుగున్నర లక్షలకుపైగా లైక్స్, 80 లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఇది చూసిన నెటిజన్లు సుజిత్‌ని తెగ పొగిడేస్తున్నారు. చాలా హార్డ్ వర్క్‌ చేసి ఆడి కార్‌ కొనుక్కునే రేంజ్‌కి ఎదిగాడంటూ ప్రశంసిస్తున్నారు. "యూత్‌కి గ్రేట్ ఇన్‌స్పిరేషన్ మీరు" అని కొందరు కామెంట్ చేశారు. "పాలకూర నుంచి ఆడి కార్ వరకూ" అని ఇంకొందరు కామెంట్ పెట్టారు. రోల్‌మోడల్ అంటూ ఆకాశానికెత్తేశారు. సుజిత్ సోషల్ మీడియాలో వ్యవసాయంలో కొత్త కొత్త పద్ధతులపై అవగాహన కల్పిస్తుంటాడు. రకరకాల పంటలు ఎలా పండించాలో నేర్పిస్తాడు. వ్యవసాయంలో టెక్నాలజీని ఎలా వినియోగించాలో చెబుతాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షలకుపైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.