UP Teachers record Instagram reels in school: రీల్స్ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నా, పెద్దా, వయసు తారతమ్యం లేకుండా వైరల్ కంటెంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటారు. అప్పుడే పుట్టిన పసిపాప నుంచి, పండు ముసలి వరకు అందరూ వైరల్ కంటెంట్ క్రియేటర్లుగా మారుతున్నారు. ఇందులో టీచర్లు, డాక్టర్లు, లాయర్లు, పోలీసులు ఇలా అన్ని రకాలకు చెందిన వారు వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తారు. వాటిలో వచ్చే లైక్, షేర్ చూసుకుంటూ సంతోష పడుతుంటారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. రీల్స్‌కు అలవాటు పడిన ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ వీడియోలకు లైక్, షేర్ చేయాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. లేకపోతే వీపు విమానం మోత మోగుతుందని బెదిరిస్తున్నారు. 


ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని కొంత మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రీల్స్‌కు అలవాటు పడ్డారు. విద్యార్థులను తమ రీల్స్‌కు లైక్ కొట్టాలని, షేర్ చేయాలంటూ వేధిస్తున్నారు. తమ అకౌంట్లకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలంటూ బలవంతం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ చేయడానికి అలవాటు పడిన టీచర్లు రోజు పాఠశాలలో వీడియోలు చిత్రీకరిస్తున్నారు. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో 'రవిపూజ' పేరుతో ఉన్న అకౌంట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. పాఠశాలలో విధుల్లో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ను సృష్టిస్తున్నారు. 


తరువాత తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను లైక్, షేర్, సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారు. వారి టార్చర్ భరించలేని విద్యార్థులు విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)ని ఆశ్రయించారు. తమ పిల్లలకు చదువులు చెప్పకుండా రీల్స్ చేయిస్తున్నారని, లైక్ షేర్ చేయాలంటూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్‌గా స్పందించిన డీఎం విచారణ జరపాలని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి గంగేశ్వరి ఆర్తి గుప్తాని ఆదేశించారు. 


దీనిపై ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ‘టీచర్ పాఠశాలలో రీల్స్ రికార్డ్ చేస్తుంది. వాటిని లైక్, షేర్ చేయమని విద్యార్థులను ఒత్తిడి చేస్తుంది. అలా చేయకపోతే మమ్మల్ని కొడతామని ఆమె బెదిరిస్తుంది’ అని వాపోయింది. తన కోసం వంటలు చేయమని, ఆహారం వండమని, టీ పెట్టమని ఓ టీచర్ విద్యార్థులను బలవంతం చేశారని మరో విద్యార్థిని ఆరోపించింది. పాఠశాలలో సరైన విద్య అందడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పకుండా రీల్స్‌ చేస్తూ, వాటికి లైక్ కొట్టాలని బలవంతం చేస్తున్నారని వాపోతున్నారు. మరి కొందరు ఉపాధ్యాయులు సైతం తరగతలకు రావడానికి ఇష్టపడడం లేదని అన్నారు. ఓ తరగతి విద్యార్థి, స్టాఫ్ రూమ్‌లో ఉన్న టీచర్ హేమ్ సింగ్‌ని తరగతికి రావాలని కోరగా ముందు జిలేబీ తినాలని, తరువాతే క్లాస్ అంటు బదులిచ్చాడని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు.


స్కూల్‌లో సోషల్ మీడియా కోసం వీడియోలు చేస్తున్న ఉపాధ్యాయులు అంబికా గోయల్, పూనమ్ సింగ్, నీతూ కశ్యప్‌గా గుర్తించారు. అయితే వారు తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి తామంతా అంకితమైనట్లు చెప్పారు. స్కూల్లో రీల్స్ చిత్రీకరణపై తమకు తెలియదని, స్కూల్ టైమ్‌లో పిల్లలకు శ్రద్ధగా పాఠాలు బోధిస్తామని అంబిక అనే ఉపాధ్యాయురాలు తెలిపారు. పిల్లలు నేర్చుకునేలా స్కూల్ టైమ్‌లో కొన్నిసార్లు వీడియోలు తీస్తామని చెప్పారు. దీనిపై ఎడ్యుకేషన్ అధికారి గంగేశ్వరి ఆర్తి గుప్తా స్పందిస్తూ.. పాఠశాలల్లో సోషల్ మీడియా రీల్స్ చేస్తున్న ఉపాధ్యాయులపై తనకు సమాచారం అందిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.