Women Reservation Bill:
సిద్దికీ వివాదాస్పద వ్యాఖ్యలు..
మహిళా రిజర్వేషన్ బిల్‌పై Rashtriya Janata Dal (RJD) నేత అబ్దుల్ బరి సిద్దికీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కొంత మంది మహిళలు లిప్‌స్టిక్, బాబ్ కట్ హెయిర్ స్టైల్‌తో వచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడుతున్నారని ఆయన చేసిన కామెంట్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
"కొంత మంది మహిళలు లిప్‌స్టిక్‌లు పెట్టుకుంటారు. బాబ్ హెయిర్ స్టైల్ మెయింటేన్ చేస్తారు. మళ్లీ వాళ్లే మహిళా రిజర్వేషన్‌ల గురించి మాట్లాడతారు. ఇలాంటి వాళ్లకు రిజర్వేషన్‌లు ఎందుకు..? వీళ్లకు బదులుగా వెనకబడిన వర్గాల్లోని మహిళలకు రిజర్వేషన్‌లు ఇవ్వాలి. ప్రభుత్వం ఆలోచన చేయాలి"
- అబ్దుల్ బరి సిద్దికీ, ఆర్‌జేడీ నేత
లోక్‌సభ ఎన్నికలు ముగిసేంత వరకూ అందరూ టీవీలకు, సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని సూచించారు సిద్దికీ. ఏ మాత్రం బుర్రకి పని చెప్పకుండా అలా ఊరికే కూర్చుని టీవీలు చూడడం మానుకోవాలని చెప్పారు. సోషల్ మీడియానీ పక్కన పెట్టాలని అన్నారు. మైనార్టీలకు లభించాల్సిన ఫలాల గురించీ పోరాటం చేయాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు. ముందు తరం వాళ్లు ఎన్నో బాధలు అనుభవించారని, ఈ తరం పిల్లలకైనా అవగాహన కల్పించాలని సూచించారు. గతంలోనూ భారత్‌లోని పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఇండియాలో పరిస్థితులేమీ బాలేవని, విదేశాలకు వెళ్లి సెటిల్ అయిపోవాలని తమ పిల్లలకు చెప్పానని అన్నారు...అబ్దుల్ బరి సిద్దిఖీ. ఆర్‌జేడీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అబ్దుల్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి. భారత్‌లో ముస్లింల స్థితిగతులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. "ఈ దేశంలో ముస్లింల పరిస్థితి ఎలా ఉందో ఓ ఉదాహరణ చెబుతాను. ఇది నా సొంత అనుభవం కూడా. నాకో కొడుకు ఉన్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. వాళ్లను అక్కడే ఉద్యోగాలు చూసుకోమని చెప్పాను. వీలైతే అక్కడి పౌరసత్వం కూడా తీసుకోవాలని సూచించాను" అని అన్నారు అబ్దుల్ బరి.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రెండు సభల్లోనూ మహిళా రిజర్వేషన్ బిల్ (Women's Reservation Bill) పాస్ అయింది. దీనిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. నారీ శక్తి వందన్ యాక్ట్ (Nari Shakti Vandan Act) పేరుతో ఈ బిల్‌ని ప్రవేశ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 20న లోక్‌సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ప్రవేశపెట్టగా..రెండు సభల్లోనూ పాస్ అయింది. ఆ తరవాత ఆమోద ముద్ర వేసేందుకు రాష్ట్రపతికి పంపింది కేంద్రం. దీన్ని పరిశీలించిన ద్రౌపది ముర్ము అప్రూవ్ చేశారు. కేంద్రం దీనిపై అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో 33% మేర మహిళలకే సీట్‌లు కేటాయిస్తారు. పార్లమెంట్‌లో ఈ బిల్ పాస్ అయినప్పుడే ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. ఈ చట్టం ద్వారా మహిళలకు న్యాయం చేసినట్టవుతుందని అభిప్రాయపడ్డారు.
Also Read: ఒక్కో ఓటర్‌కి కిలో మటన్ ఇచ్చినా ఓడించారు, ఇకపై ఎవరికీ టీ కూడా ఇవ్వను - గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు