AIDMK Leaves NDA:
ఎన్‌డీఏ కూటమికి గుడ్‌బై..
తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల జరిగిన కీలక పరిణామం ఏదైనా ఉందంటే...అది AIDMK బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి నుంచి బయటకు రావడం. దాదాపు నాలుగేళ్లుగా అదే కూటమిలో ఉంటున్న అన్నా డీఎమ్‌కే ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకుంది. పైగా లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల బీజేపీకి గట్టి దెబ్బ తగిలినట్టైంది. మొదటి నుంచి ద్రవిడ పార్టీలే ఆ రాష్ట్రాన్ని ఏలుతున్నాయి. అక్కడి పోటీని తట్టుకునేందుకు అన్నా డీఎమ్‌కేతో మైత్రి కుదుర్చుకుంది. కొంతైనా క్యాడర్ పెంచుకోవాలని ప్రయత్నించింది. కానీ...అది సాధ్యపడలేదు. ఇప్పుడు అన్నా డీఎమ్‌కే పార్టీ ఎన్‌డీఏ నుంచి బయటకు రావడం మరింత షాక్‌కి గురి చేసింది. అయితే...కూటమి నుంచి వైదొలగడానికి గల కారణాలపై రకరకాల వాదనలు వినిపించాయి. ఈ పరిణామాలపై AIDMK నేత, మాజీ మంత్రి కేసీ కరుప్పణ్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైని అధ్యక్షుడిగా అంగీకరించాలని ఒత్తిడి తీసుకొచ్చారని, అందుకే కూటమి నుంచి బయటకు వచ్చేశామని వెల్లడించారు. అన్నామలైపై చాలా రోజులుగా గుర్రుగా ఉంది అన్నా డీఎమ్‌కే. ఓ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి జయలలితను విమర్శించారు అన్నామలై. దీనిపై AIDMK అసహనం వ్యక్తం చేసింది. తమ నేతపైనే విమర్శలు చేసిన తరవాత కూటమిలో ఉండాల్సిన అవసరం ఏముందని, అందుకే బయటకు వచ్చేశామని కరుప్పణ్ణన్ తెలిపారు. అంతే కాదు. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలైని ముఖ్యమంత్రి అభ్యర్థిగానూ అంగీకరించాలని బీజేపీ ఒత్తిడి చేసిందని అసహనం వ్యక్తం చేశారు.
AIDMK జనరల్ సెక్రటరీ పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించగా...అందుకు బీజేపీ చీఫ్ అన్నామలై ఒప్పుకోలేదు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి.
"మాజీ ముఖ్యమంత్రి జయలలితపై విమర్శలు చేసిన వ్యక్తిని ఎలా సహిస్తాం..? అందుకే మా పార్టీ హైకమాండ్ NDA నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నాం. అన్నామలైని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు. అందుకు మాపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇది నచ్చకే బయటకు రావాల్సి వచ్చింది"
- కేసీ కరుప్పణ్ణన్, AIDMK నేత