Presidential Election 2022: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ను ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఇవాళ సమావేశం అయింది. 20 మంది పేర్లు ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. చివరకు ద్రౌపది ముర్ము పేరు ఖరారు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ మహిళను చేయాలని నిర్ణయించామని జేపీ నడ్డా అన్నారు. ద్రౌపది ముర్ము మంత్రిగా, గవర్నర్ గా పనిచేశారని గుర్తుచేశారు. ఆమె విశేష ప్రతిభాశాలి అన్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా తూర్పు ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ ఉంటే బావుంటుందని భావించామని జేపీ నడ్డా అన్నారు. 






ఝార్ఖండ్ 9వ గవర్నర్


ద్రౌపది ముర్ము 1958 జూన్ 20న జన్మించారు. భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న ఆమె ఝార్ఖండ్ 9వ గవర్నర్ గా పనిచేశారు. ద్రౌపది ముర్ము బీజేపీ సీనియర్ నాయకురాలు. ఝార్ఖండ్ రాష్ట్రం 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు (2015-2021) పాటు పూర్తికాలం గవర్నర్‌గా సేవలు అందించిన తొలి వ్యక్తి ఆమె. ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా బైదాపోసి గ్రామంలో 20 జూన్ 1958లో జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. ఆమె సంతాల్ కుటుంబానికి చెందినవారు. ద్రౌపది ముర్ము భర్త శ్యామ్ చరణ్ ముర్ము, ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ద్రౌపది ముర్ము భర్త, ఇద్దరు కుమారులను ఓ ప్రమాదంలో కోల్పోయారు.


రెండు సార్లు ఎమ్మెల్యే


ఒడిశాలోని బీజేపీ, బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో ద్రౌపది ముర్ము మార్చి 6, 2000 నుంచి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్య, రవాణా శాఖకు స్వతంత్ర బాధ్యత, ఆగస్ట్ 6, 2002 నుంచి మే 16, 2004 వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖకు మంత్రిగా పనిచేశారు. 2000, 2004లలో రాయరంగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు.


దేశానికి గొప్ప రాష్ట్రపతి అవుతారు - ప్రధాని మోదీ 


 ద్రౌపది ముర్ము తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారని ప్రధాని మోదీ అన్నారు. పేదలు, అణగారిన అట్టడుగు వర్గాల వారి సాధికారత కోసం కృషి చేశారన్నారు. ఆమెకు గొప్ప పరిపాలనా అనుభవం ఉందన్నారు. ఆమె మన దేశానికి గొప్ప రాష్ట్రపతి అవుతారన్నారు. లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా పేదరికాన్ని అనుభవించిన కష్టాలను ఎదుర్కొన్న వారికి ద్రౌపది ముర్ము గొప్ప స్ఫూర్తి అన్నారు. విధానపరమైన విషయాలపై ఆమెకున్న అవగాహన, దయగల స్వభావం మన దేశానికి ఎంతో మేలు చేస్తాయని ప్రధాని మోదీ అన్నారు.






Also Read : Presidential Polls 2022: రాష్ట్రపతి రేసులో యశ్వంత్ సిన్హా- విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి


Also Read : TRS Support Yaswant Sinha : యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు - కేసీఆర్ కీలక నిర్ణయం!