President Swearing-In Ceremony: దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ.. ద్రౌపది చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఒకప్పుడు చదువుకోవడం నా కల.. ఇప్పుడు రాష్ట్రపతిని అయ్యాను. నా ఎన్నిక దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీక. రాష్ట్రపతిగా ఎన్నికవడం నా అదృష్టం. అందరి విశ్వాసం, సంక్షేమం కోసం పాటుపడతాను. ఓ సాధారణ ఆదివాసీని దేశ అత్యున్నత స్థానంలో నిలబెట్టారు. మీ విశ్వాసం నిలబెట్టేందుకు కృషి చేస్తాను. భారత్ అజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటోంది. వచ్చే 25 ఏళ్లలో దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తుంది. - ద్రౌపది ముర్మ, రాష్ట్రపతి
పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ సహా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు.