Droupadi Murmu Oath Ceremony:


అప్పటి నుంచే ఈ సంప్రదాయం మొదలైంది..


ద్రౌపది ముర్ము జులై 25 వ తేదీన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆమె ఈ పదవీ బాధ్యతలు తీసుకుంటున్న తేదీపై ఇప్పుడో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో రాష్ట్రపతిగా సక్సెస్‌ అయిన వారందరూ జులై 25వ తేదీనే ప్రమాణ స్వీకారం చేశారన్న ఇంట్రెస్టింగ్ విషయం తెరపైకి వచ్చింది. జులై 25న బాధ్యతలు తీసుంకుటున్న పదో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము, అదే విధంగా విజయవంతం అవుతారని అంటున్నారు. 1977 నుంచి చూసుకుంటే ఇదే తేదీన బాధ్యతలు తీసుకున్న రాష్ట్రపతులెందరో ఉన్నారు. 1950లో రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి భారత గవర్నర్‌గా జనవరి 26న ప్రమాణస్వీకారం చేశారు. 1952లో తొలిసారి రాష్ట్రపతి ఎన్నికలు జరగ్గా, ఆ ఎన్నికల్లోనూ విజయం సాధించారు రాజేంద్ర ప్రసాద్. 1962 మే వరకూ ఆయనే రాష్ట్రపతిగా ఉన్నారు. 1962 మే 13వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్నారు. 1967 మే 13వ తేదీ వరకూ ఆయన పదవిలోనే ఉన్నారు. ఆ తరవాత వచ్చిన జాకీర్ హుస్సేన్, ఫక్‌రుద్దీన్ అలీ అహ్మద్ పదవిలో ఉండగానే మృతి చెందారు. 1977లో నీలం సంజీవరెడ్డి భారతదేశానికి ఆరో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అప్పటి నుంచి రాష్ట్రపతిగా గెలిచిన వారందరూ ఇదే తేదీన బాధ్యతలు చేపట్టటం మొదలైంది. మరో విశేషం ఏంటంటే...వీరంతా ఈ పదవిని నిర్వహించటంలో పూర్తి స్థాయిలో విజయం సాధించారు. గియాని జలీల్ సింగ్, ఆర్ వెంకటరామన్, శంకర్ దయాల్ శర్మ, కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలామ్, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్‌నాథ్ కోవింద్..వీరంతా జులై 25వ తేదీనే ప్రమాణ స్వీకారం చేశారు. 


రాష్ట్రపతికి కావాల్సిన కనీస అర్హతలివే..


1. భారత రాజ్యాంగం ప్రకారం..రాష్ట్రపతిగా ఎన్నికయ్యే వ్యక్తి కచ్చితంగా భారత పౌరుడై ఉండాలి. 
2. 35 ఏళ్లు నిండితే గానీ రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం ఉండదు. 
3. లోక్‌సభ ఎంపీగా ఎన్నికై ఉండాలి. 


రాష్ట్రపతికి జీతమెంతిస్తారో తెలుసా? 


రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తికి నెలకు రూ.5 లక్షల వేతనం అందిస్తారు. 2018లో రాష్ట్రపతి జీతం రూ.1.5లక్షలుగా ఉండగా, తరవాత దాన్ని రూ.5 లక్షలకు పెంచారు. 


ఎక్కడ ఉంటారు..? 


రాష్ట్రపతి భవన్‌...రాష్ట్రపతి అధికారిక నివాసం. ఇందులో మొత్తం 340 గదులుంటాయి. రెసిప్షన్ హాల్స్, గెస్ట్ రూమ్స్, ఆఫీసులు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ప్రెసిడెంట్ ఎస్టేట్‌ ఉంటుంది. ఇందులో పెద్ద పెద్ద గార్డెన్‌లు, ఓపెన్‌ స్పేసెస్, బాడీగార్డ్స్‌, సిబ్బంది ఇళ్లు ఉంటాయి.