Stock Market Weekly Review July Week 4: హమ్మయ్య..! చాన్నాళ్ల తర్వాత మదుపరి మనస్ఫూర్తిగా నవ్వాడు! గతేడాది నవంబర్‌ నుంచి భారీగా పతనమైన ఈక్విటీ మార్కెట్లు క్రమేపీ పుంజుకుంటున్నాయి. ఛార్ట్‌ ప్యాటర్నుల్లో ఇన్నాళ్లు లోయర్‌ లోస్ ఫామ్‌ చేసిన సూచీలు ఇప్పుడు హయ్యర్‌ హైస్‌ హయ్యర్‌ లోస్‌ ఫామ్‌ చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు సైతం గాడిన పడుతుండటతో కొన్ని బలమైన సంకేతాలు అందుతున్నాయి. మరి చివరి వారం మార్కెట్లు ఎలా ముగిశాయి? రాబోయే వారం ఎలా ఉండబోతోంది?


బీఎస్‌ఈ సెన్సెక్స్‌ జోరు


ఈ మధ్య కాలంలో మార్కెట్లు వరుసగా ఆరు సెషన్లు లాభాల్లో ముగియడం ఇదే తొలిసారి! ఇక గడిచిన మూడు వారాలూ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ లాభపడటం సానుకూల అంశం. జులై 18తో మొదలైన వారంలో సెన్సెక్స్‌ 2.92 శాతం ర్యాలీ చేసింది. 54,069 వద్ద ఓపెనైన సూచీ 54,042 వద్ద వారాంతపు కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత పుంజుకొని 56,186 వద్ద గరిష్ఠాన్ని అందుకొంది. చివరికి 56,072 వద్ద ముగిసింది. అంటే 2003 పాయింట్లు లాభపడింది. దాంతో మదుపర్లు దాదాపుగా రూ.10 లక్షల కోట్లమేర సంపదను పోగేశారు.


ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ దూకుడు


ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం ఇదే దారిలో నడిచింది. చివరి వారంలో 4.18 శాతం మేర ర్యాలీ చేసింది. సోమవారం 16,183 వద్ద ఆరంభమైన సూచీ 16,160 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. ఆ తర్వాత పుంజుకొని 16,752 వద్ద గరిష్ఠ స్థాయిని అందుకుంది. మొత్తంగా 16,719 వద్ద క్లోజైంది. ఏకంగా 536 పాయింట్లు లాభపడింది. బ్యాంకు నిఫ్టీ, మిగిలిన రంగాల సూచీలూ పైపైకి వెళ్తున్నాయి.


మరింత క్షీణించిన రూపాయి


డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణత మాత్రం ఆగలేదు. చరిత్రలో తొలిసారి అత్యంత కనిష్ఠానికి చేరుకుంది. సోమవారం 79.817 వద్ద మొదలైన రూపాయి 80.075 వద్ద ఆల్‌ టైమ్‌ లో లెవల్‌ను టచ్‌ చేసింది. ఆ తర్వాత కాస్త పుంజుకొని 79.703 వద్ద గరిష్ఠానికి చేరుకుంది. చివరికి 0.09 శాతం నష్టంతో 79.830 వద్ద ముగిసింది. కేవలం డాలర్‌తో పోలిస్తేనే భారత కరెన్సీ క్షీణించింది. యూరో, పౌండ్‌, ఇతర ఆసియా దేశాల కరెన్సీల కన్నా మెరుగ్గానే ఉండటం శుభసూచకం.


యూఎస్‌ ఫెడ్‌ భయం


గత వారం అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలే అందాయి. క్రూడాయిల్‌ ధరలు పడిపోవడం, వంటనూనెల ధరలు తగ్గడం మదుపర్లలో పాజిటివ్‌ సెంటిమెంటును పెంచాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం తగ్గి ముడి వనరుల సరఫరా, వస్తుసేవల సరఫరా పెరగడం మేలు చేసింది. ఈ సారీ మార్కెట్లకు పెద్ద చిక్కే ఉంది. యూఎస్‌ ఫెడ్‌ ద్రవ్య సమీక్ష, వడ్డీరేట్ల పెంపు వంటి ఈవెంట్లు ఉన్నాయి. కాబట్టి మదుపర్లు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. రూపాయి క్షీణతను అడ్డుకొనేందుకు డాలర్‌ రిజర్వులను ఉపయోగిస్తామని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు.