స్టాక్‌ మార్కెట్‌ అంటేనే జూదం! అందులో డబ్బులు పెడితే పోతాయనే చాలా మంది అభిప్రాయం! తెలివైన లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్టర్లు మాత్రం దీనిని అంగీకరించరు. నాణ్యమైన కంపెనీలను విశ్లేషించి సుదీర్ఘ కాలం మదుపు చేస్తే కోట్లు కురుస్తాయన్నది వారి నమ్మకం. అందుకు తగ్గట్టే భవిష్యత్తులో అనేక రెట్లు లాభాల్ని అందించే షేర్లను వారు వెతుకుతారు. ఇప్పుడు చెప్పే మల్టీబ్యాగర్‌ అలాంటిదే. తొమ్మిదేళ్లలో రూ.లక్షను రూ.82 లక్షలుగా మార్చింది.


బేర్‌ మార్కెట్లో దూకుడు


గతేడాది నవంబర్‌ నుంచి స్టాక్‌ మార్కెట్లు బాగా నష్టపోయాయి. ఐటీ కంపెనీల షేర్లైతే కనీసం 30-50 శాతం మేర క్షీణించాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జనవరి నుంచి 42 శాతం రాబడి ఈ ఐటీ షేరు! టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ఎలెక్సీ ఇన్వెస్టర్లకు మల్టీ బ్యాగర్‌ రిటర్నులు అందించింది. తొమ్మిదేళ్లలో ఈ కంపెనీ షేరు ధర రూ.102 నుంచి రూ.8,370కి చేరుకుంది. దాదాపుగా 8100 శాతం రాబడి ఇచ్చింది.



ఎప్పుడు ఎంత పెరిగిందంటే?


గత నెల్లో టాటా ఎలెక్సీ షేరు రూ.7788 నుంచి రూ.8370కి పెరిగింది. 7.50 శాతం వరకు దూసుకెళ్లింది. ఇక చివరి ఆరు నెలల్లో  రూ.7,040 నుంచి రూ.8,370కి ఎగిసింది. అంటే 19 శాతం ర్యాలీ చేసింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో రూ.5,890గా ఉన్న ధర ఇప్పుడు రూ.8,370కి చేరుకుంది. 2022లో 42 శాతం లాభపడింది. చివరి ఏడాదిలో ఈ ఐటీ స్టాక్‌ రూ.4250 నుంచి 95 శాతం పెరిగి రూ.8370కి చేరుకుంది. ఇక చివరి ఐదేళ్లలో రూ.875 నుంచి రూ.8370కి పెరిగింది. 860 శాతం జంప్‌ చేసింది. 9 ఏళ్లలో 8100 శాతం ర్యాలీ చేసి రూ.102 నుంచి రూ.8370 స్థాయికి ఎగిసింది.


కోటీశ్వరులను చేసింది!


టాటా ఎలెక్సీ షేరు చరిత్రను చూస్తే ఒక నెల రోజుల క్రితం మీరు రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ.1.075 లక్షలు అందేవి. ఆరు నెలల కిందటైతే రూ.1.19 లక్షలు వస్తాయి. ఈ ఏడాది ఆరంభంలో లక్ష రూపాయలు పెట్టుంటే ఇప్పుడు రూ.1.42 లక్షలు చేతికొచ్చేవి. ఏడాది క్రితం లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రెండు లక్షల రూపాయల వరకు అందుకొనేవాళ్లు. ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసుంటే ఇప్పుడు రూ.9.60 లక్షలు అందేవి. తొమ్మిదేళ్ల క్రితం లక్ష పెడితే ఇప్పుడు రూ.82 లక్షలు చేతికొచ్చేవి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.