President And PM Modi Warm Wishes To Telangana People: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu), పీఎం మోదీ (PM Modi), కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) శుభాకాంక్షలు తెలిపారు. 'రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పౌరులందరికీ ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు! తెలంగాణ సుసంపన్నమైన వారసత్వం, మిశ్రమ సంస్కృతి, ఔత్సాహిక ప్రజలను కలిగి ఉంది. రాష్ట్రం దేశంలోని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్‌గా అవతరించింది. తెలంగాణ మరియు దాని ప్రజలు నిరంతరం అభివృద్ధి చెందాలని మరియు దేశ అభివృద్ధికి తోడ్పడాలని నేను ప్రార్థిస్తున్నాను.' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. అటు, తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ సహకారం మరువలేనిదని.. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలు అని పేర్కొన్నారు. 'తెలంగాణ సోదర సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం, దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయునికి గర్వకారణం. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం.' అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
సోనియా గాంధీ వీడియో సందేశం
తెలంగాణ అవతరణ దినోత్సవ వేళ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఆమె స్మరించుకున్నారు. 'తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్యారెంటీలను అమలు చేస్తాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కళను నెరవేరుస్తామని 2004లో కరీంనగర్ సభలో హామీ ఇచ్చాం. గడిచిన పదేళ్లుగా ప్రజలు కాంగ్రెస్ పట్ల అత్యంత ప్రేమాభిమానాలు చూపారు.' అని సోనియా వీడియో సందేశంలో తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఈ వీడియోను ప్రదర్శించారు.
Also Read: Telangana Anthem: తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' విడుదల - రచయిత అందెశ్రీ భావోద్వేగం